Road Accident In Bihar :బిహార్ కైమూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మోహానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి (ఎన్‌హెచ్-2)లో ఉన్న దేవకాలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ టీం సాయంతో మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం దగ్గర్లోని భబువా సదర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
బైక్ రైడర్‌ను రక్షించబోయి
'మోహానియా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం స్కార్పియో నడుపుతున్న డ్రైవర్ ఎదురుగా ఉన్న బైక్‌ను తప్పించే క్రమంలో అదుపు తప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న భారీ కంటైనర్‌ను ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో బైక్ రైడర్ కూడా ఉన్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించాము. ఈ దుర్ఘటనతో ఎన్‌హెచ్‌పై ట్రాఫిక్ స్తంభించింది. ముందుగా దానిని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాము' అని మోహానియా ఎస్డీపీఓ దిలీప్ కుమార్ తెలిపారు. మృతులకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో సంబంధిత స్టేషన్ పోలీసులు నిమగ్నమయినట్లు ఆయన చెప్పారు.