Amit Shah On Lok sabha Election :రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ 400కంటే ఎక్కువ లోక్ సభ స్థానాలను గెలవాలనుకుంటుందని ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. గత పదేళ్లుగా తమకు పార్లమెంట్లో పూర్తి మెజారిటీ ఉందని, కానీ ఎప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలనుకోలేదన్నారు. దేశ రాజకీయాల్లో సుస్థిరతను తీసుకువచ్చేందుకు ఎన్డీఏ 400కంటే ఎక్కువ సీట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. తమకు ఎలాంటి ప్లాన్ బీ లేదని, అద్భుతమైన మెజారిటీతో మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల వేళ ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"గత 10 ఏళ్లుగా ఎన్డీఏకు పార్లమెంట్లో రాజ్యాంగాన్ని మార్చే మెజారిటీ ఉంది. కానీ మేము ఎప్పుడూ అలా ఆలోచించలేదు. రాహుల్ బాబా అండ్ కంపెనీ ఇలా దుష్ప్రచారం చేస్తుంది. దేశ సరిహద్దులను కాపాడుకోవడానికి, భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు, మరికొంత మంది పేదలకు భరోసా ఇవ్వడానికి 400 సీట్లను ఎన్డీఏ గెలవాలి. ఎందుకంటే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు ఇంకా అందలేదు. 70 ఏళ్లు దాటిన ప్రతి సీనియర్ సిటిజన్‌కు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలనుకుంటున్నాం. మేము ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ చట్టం, యూసీసీను తీసుకొచ్చాం. అలాగే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాం. మెజారిటీని దుర్వినియోగం చేసిన చరిత్ర బీజేపీకి లేదు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో మెజారిటీని కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేసింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించింది. లక్షన్నర మందిని అకారణంగా 19నెలల పాటు జైల్లో పెట్టింది. రాహుల్ బాబా వ్యాఖ్యలను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. దేశంలోని యువత 30 ఏళ్లుగా అస్థిర ప్రభుత్వాలను చూశారు. మోదీ హయాంలో సుస్థిర ప్రభుత్వాలను రెండు దఫాలుగా చూశారు. మరోసారి స్థిరమైన ప్రభుత్వం దేశంలో ఏర్పడబోతుంది."
--అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని చూసినప్పుడల్లా ప్రజలకు లిక్కర్ స్కామ్ గుర్తుకు వస్తుందని షా ఎద్దేవా చేశారు. 'దిల్లీ మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చింది. జూన్ 1న ఆయన మళ్లీ జైలుకు వెళ్లాలి.' అని అమిత్ షా విమర్శించారు.