Remarried Woman Property Rights : భర్త మరణించిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న మహిళకు చనిపోయిన తన భాగస్వామి ఆస్తిలో వాటా ఉంటుందని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టం కింద మరణించిన తన భర్త ఆస్తిని వారసత్వంగా పొందకుండా నిరాకరించే నిబంధనేదీ లేదని ఓ కేసు విషయంలో వ్యాఖ్యానించింది.
మళ్లీ పెళ్లి చేసుకున్న మహిళకు చనిపోయిన భర్త ఆస్తిలో వాటా: హైకోర్టు - REMARRIED WOMAN PROPERTY RIGHTS
మళ్లీ వివాహం చేసుకున్న మహిళకు మరణించిన భర్త ఆస్తిలో వాటాకు ఉంటుందన్న మద్రాసు హైకోర్టు
Published : 6 hours ago
అసలేం జరిగిందంటే?
తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిక అనే మహిళ భర్త చిన్నయ్యన్ కొంత కాలం క్రితం మరణించారు. ఆ తర్వాత ఆమె మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమెకు చనిపోయిన తన భర్త ఆస్తిలో వాటా ఇచ్చేందుకు చిన్నయ్యన్ కుటుంబసభ్యులు నిరాకరించారు. ఆ విషయంలో మల్లిక సేలం జిల్లా కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆమెకు నిరాశ ఎదురైంది. దివంగత భర్త ఆస్తిని వారసత్వంగా పొందకుండా నిరోధించడానికి ఆమె పునర్వివాహం ఒక కారణమని పేర్కొంది జిల్లా కోర్టు.
ఆ తర్వాత దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు మల్లిక. విచారణకు స్వీకరించిన హైకోర్టు, దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. హిందూ వివాహ చట్టం- మహిళ పునర్వివాహం చేసుకున్నా, మరణించిన ఆమె భర్త ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును కల్పిస్తుందని తెలిపింది. మళ్లీ వివాహం చేసుకున్నారనే సాకుతో ఆస్తిని వారసత్వంగా పొందకుండా నిరాకరించే నిబంధన ఏదీ లేదని కోర్టు చెప్పింది. అలాంటి నిబంధన 2005లో రద్దు అయిందని గుర్తు చేసింది. వారసత్వంలో సమానత్వం పాటించాలనే సూత్రాన్ని హైకోర్టు సమర్థించింది. ఆస్తి విషయంలో మహిళలకు సమాన హక్కులు ఉంటాయని గుర్తు చేసింది.