PM Modi Attacks Congress : బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ సమర్థించారు. అంబేడ్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ చీకటి చరిత్రను అమిత్ షా బహిర్గతం చేశారని, దీంతో హస్తం పార్టీ ఉలిక్కిపడిందని బుధవారం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కొన్నేళ్లపాటు దేశంలో అధికారంలో ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీల సాధికారత కోసం ఏమీ చేయలేదని ఆరోపించారు. మంగళవారం రాజ్యాంగంపై చర్చ సందర్భంగా బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించేలా అమిత్ షా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో హస్తం పార్టీపై విమర్శలు గుప్పించారు.
"అంబేడ్కర్‌ను అవమానించిన, ఎస్సీ, ఎస్టీ వర్గాలను విస్మరించిన కాంగ్రెస్ చీకటి చరిత్రను పార్లమెంట్ వేదికగా అమిత్ షా బట్టబయలు చేశారు. ఆయన చెప్పిన వాస్తవాలను చూసి కాంగ్రెస్ ఉలిక్కిపడింది. అందుకే పాపం వారు ఇప్పుడు నాటకాలాడుతున్నారు. ప్రజలకు నిజమేంటో తెలుసు. అంబేడ్కర్‌ను లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండుసార్లు ఓడిపోయేలా చేసింది. నెహ్రూ ఆయనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. అలాగే బాబా సాహెబ్‌కు భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. అంబేడ్కర్ చిత్రపటాన్ని పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో పెట్టడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది."
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
'ఆ పార్టీవి డర్టీ ట్రిక్స్'
అంబేడ్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి, ఎస్సీ, ఎస్టీలను కించపరచడానికి రాజవంశం నేతృత్వంలోని ఒక పార్టీ ప్రతి డర్టీ ట్రిక్స్ ఎలా చేస్తుందో దేశ ప్రజలు పదేపదే చూస్తున్నారని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు వ్యాప్తి చేసే అబద్దాలు వారి పరిపాలనలోని ఆకృత్యాలను దాచగలవని భావిస్తున్నారని, అందుకే ప్రజలు వారిని తీవ్రంగా తప్పుపడుతున్నారని ఎద్దేవా చేశారు.
"గత దశాబ్ద కాలంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేసింది. 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి చేశాం. అలాగే ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేశాం. స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఉజ్వల యోజన వంటి కార్యక్రమాలను గత పదేళ్లలో చేపట్టాం. పేద, అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలను అందించాం. అంబేడ్కర్‌తో అనుబంధం ఉన్న ఐదు ప్రసిద్ధ ప్రదేశాలైన పంచతీర్థాన్ని అభివృద్ధి చేసేందుకు మా ప్రభుత్వం కృషి చేసింది. దశాబ్దాలుగా చైత్ర భూమికి సంబంధించిన సమస్య పెండింగ్‌లో ఉంది. మా ప్రభుత్వం సమస్యను పరిష్కరించింది. అంతేకాదు నేను స్వయంగా అక్కడ ప్రార్థనకు వెళ్లాను. " అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు.
Prime Minister Narendra Modi tweets, " if the congress and its rotten ecosystem think their malicious lies can hide their misdeeds of several years, especially their insult towards dr. ambedkar, they are gravely mistaken! the people of india have seen time and again how one party,… pic.twitter.com/U7e3sRrNc8
— ANI (@ANI) December 18, 2024
అమిత్ షా రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్
రాజ్యాంగంపై జరిగిన చర్చ సందర్భంగా బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ బుధవారం ఉదయం డిమాండ్ చేసింది. రాజ్యసభలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకుగానూ అమిత్ షా బహిరంగంగా, పార్లమెంటులో క్షమాపణ చెప్పాలని కోరింది. రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కు రాజ్యాంగంపై ఉన్న ద్వేషానికి అద్దం పడుతున్నాయని ఆరోపించింది.
'బాబా సాహెబ్‌ను విమర్శిస్తే ఊరుకోం'
అమిత్ షా అంబేడ్కర్, భారత రాజ్యాంగాన్ని అవమానించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఆయనకు మనుస్మృతి, ఆర్ఎస్ఎస్ భావజాలం- బాబా సాహెబ్ అంబేడ్కర్, ఆయన రచించిన రాజ్యాంగాన్ని గౌరవించకూడదని నేర్పుతోందని ఆరోపించారు. అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు.
"అంబేడ్కర్ గురించి హోం మంత్రి మాట్లాడుతున్నప్పుడు మేమంతా ఆపేందుకు ప్రయత్నించాం. అంబేడ్కర్ పేరును 100సార్లు జపించే బదులు భగవంతుని నామాన్ని ఇన్నిసార్లు స్మరించి ఉంటే ఏడుసార్లు స్వర్గానికి వెళ్లి ఉండేవారమని అమిత్ షా అన్నారు. ఆ సమయంలో నేను మాట్లాడేందుకు చేయి ఎత్తాను. కానీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. రాజ్యాంగంపై చర్చ జరుగుతున్నందున అందరం సహకరించాలని నిర్ణయించుకుని మౌనంగా కూర్చున్నాం. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ను దూషిస్తే దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతాయి. అంబేడ్కర్‌ను అవమానిస్తే విపక్షాలు ఊరుకోవు." అని ఖర్గే పార్లమెంట్ ఆవరణలో మీడియాతో వ్యాఖ్యానించారు.
#WATCH | On Union HM's speech in RS during Constitution debate, Rajya Sabha LoP and Congress MP Mallikarjun Kharge says " ...when amit shah was talking about dr br ambedkar, he said 'you people keep chanting the name of ambedkar 100 times, if you took the name of god these many… pic.twitter.com/KZH4FVLWZ0
— ANI (@ANI) December 18, 2024
'వారు అంబేడ్కర్‌ను వ్యతిరేకిస్తారు'
మనుస్మృతిని విశ్వసించే వారే అంబేడ్కర్‌ను వ్యతిరేకిస్తారని లోక్‌సభలో పక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మరోవైపు, అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు, అదానీ వివాదంపై చర్చించాలని పుట్టపడుతూ బుధవారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోని రాజ్భవన్ల ముట్టడి కార్యక్రమం చేపట్టింది కాంగ్రెస్.
'వారికి 240 నుంచి 40కి తగ్గిస్తారు'
అంబేడ్కర్‌పై బీజేపీ నేతలు ఎలాంటి ఆలోచనలో ఉన్నారో దేశానికి అమిత్ షా చూపించారని కాంగ్రెస్ ఎంపీ డాంగీ తెలిపారు. అమిత్ షా అవమానించిన అణగారిన వర్గాలే వారి సీట్లను 240 నుంచి 40కి తగ్గిస్తాయని ఎద్దేవా చేశారు. అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే, ఆయన రాజ్యాంగబద్ధమైన పదివిలో ఉండే హక్కును కోల్పోయారని విమర్శించారు.
'అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరిస్తోంది'
బాబా సాహెబ్ అంబేడ్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరిస్తోందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాజ్యసభలో అమిత్ షా ప్రసంగంలోని చిన్న క్లిప్ ను పట్టుకుని కాంగ్రెస్ దాన్ని వక్రీకరిస్తోందని, అది చాలా తప్పని విమర్శించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ బతికున్నప్పుడు కాంగ్రెస్ ఆయనను అవమానించిందని షా స్పష్టంగా చెప్పారని గుర్తు చేసుకున్నారు. తమ పాపాలను కడుక్కోవడానికి, రాజకీయ ప్రయోజనాల కోసం అంబేడ్కర్ పేరును కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని కిరణ్ రిజిజు మండిపడ్డారు. తమ ప్రభుత్వం అంబేడ్కర్‌ను గౌరవిస్తోందని తెలిపారు. నెహ్రూ కేబినెట్ నుంచి అంబేడ్కర్ ఎందుకు వైదొలగాల్సి వచ్చిందో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ ను రాజీనామా చేయాల్సిందిగా నెహ్రు పట్టుపట్టారని ఆరోపించారు. అలాగే లోక్ సభ ఎన్నికల్లో అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఓడించిందని విమర్శించారు.
#WATCH | Union Parliamentary Affairs Minsiter Kiren RIjiju says " congress party and some of its allies have taken out a small clip of the speech given by home minister amit shah in rajya sabha yesterday, twisted it and made it viral. the home minister yesterday explained in very… pic.twitter.com/lMmap9A71R
— ANI (@ANI) December 18, 2024
విపక్షాల నిరసనలు
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. మకరద్వార్ ఎదుట అంబేడ్కర్ చిత్రపటాలను పట్టుకొని వారు ఆందోళన చేశారు. "జై భీమ్ ", "సంఘ్ కా విదాన్ నహీ చలేగా", "అమిత్ షా మాఫీ మాంగో" అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనల్లో కాంగ్రెస్ సహా డీఎంకే, ఆర్జేడీ, ఆప్ ఎంపీలు పాల్గొన్నారు.
VIDEO | Opposition leaders protest inside Parliament premises against Union Home Minister Amit Shah's remarks on Dr. BR Ambedkar during his speech in Rajya Sabha yesterday.#ParliamentWinterSession2024
— Press Trust of India (@PTI_News) December 18, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/rpKIpJrqZT
అమిత్ షా ఏమన్నారంటే?
భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటులోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు భారత రాజ్యాంగంపై చర్చ కొనసాగింది. కాగా, మంగళవారం జరిగిన చర్చ సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే హస్తం పార్టీ బీఆర్ అంబేడ్కర్ పేరును వాడుకుంటుందని ఆరోపించారు. అంబేడ్కర్ అని జపం చేయడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిందని అన్నారు. అంబేడ్కర్ పేరుకు బదులుగా దేవుడి పేరు తలుచుకుంటేనైనా కొంచెం పుణ్యమైన వస్తుందని, స్వర్గానికి వెళ్లొచ్చని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా దుమారం రేగింది.