14 Months Old Baby Heart Transplant :14 నెలల చిన్నారికి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన వైద్యులు. రిస్ట్రిక్టివ్ కార్డియోమయోపతితో బాధపడుతున్న చిన్నారికి 72 గంటలపాటు శ్రమించి ఆపరేషన్ చేశారు నారాయణ హెల్త్ సిటీ వైద్యులు. దీంతో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడింది.
అసలేం జరిగిందంటే?
10 నెలల వయసులోనే చిన్నారికి గుండె సమస్య బయటపడింది. కామెర్లు, బరువు తగ్గడం, పొత్తికడుపులో ద్రవం చేరడం (అస్సైట్స్), సరిగ్గా ఆహారం తీసుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. చిన్నారి పరిస్థితి రోజురోజుకు క్షీణించడం వల్ల ఆమె తల్లిదండ్రులు బెంగళూరులోని నారాయణ హెల్త్ సిటీకి తీసుకొచ్చారు. ఆసుపత్రి హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ విభాగాధిపతి డాక్టర్ శశిరాజ్ నేతృత్వంలోని వైద్య బృందం చిన్నారికి వైద్య పరీక్షలు చేసింది. చిన్నారి ప్రాణాలను కాపాడాలంటే గుండె మార్పిడి శస్త్ర చికిత్స అవసరమని తేల్చింది.
రెండు నెలలుగా వైద్యుల పర్యవేక్షణలో చిన్నారి!
ఆగస్టు 18న రెండున్నరేళ్ల చిన్నారి గుండెను డాక్టర్ సుదేశ్ ప్రభు, డాక్టర్ కుమారన్, డాక్టర్ శ్రీధర్ జోషి నేతృత్వంలోని అత్యంత నైపుణ్యం కలిగిన వైద్య బృందం 14 నెలల చిన్నారికి అమర్చారు. 72 గంటలపాటు శ్రమించి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. రెండు నెలలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న చిన్నారి తాజాగా డిశ్చార్జ్ అయ్యింది. బరువు పెరగడం, ఇతర ఆరోగ్య సమస్యలు కుదుటపడడం వల్ల చిన్నారిని డిశ్చార్డ్ చేశామని నారాయణ సిటీ వైద్యులు తెలిపారు.
"పిల్లల్లో గుండె ఫెయిల్యుర్ చాలా ఇబ్బందికరమైన సమస్య. ఇటువంటి పరిస్థితుల్లో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయడం సవాల్‌తో కూడుకున్న పని. మా వైద్య బృందం సమష్టిగా కృషి చేసి ఆపరేషన్‌ను సక్సెస్ ఫుల్‌గా చేసింది. అలాగే గుండె దానం చేసిన చిన్నారి కుటుంబానికి ధన్యవాదాలు."
-- డాక్టర్ శశిరాజ్ , హార్ట్ ఫెయిల్యూర్ విభాగాధిపతి
'అందరూ అంకితభావంతో పనిచేశారు'
"14 ఏళ్ల చిన్నారికి గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా చేయడం ఆనందంగా ఉంది. ఇది నారాయణ సిటీ ఆస్పత్రి గర్వించదగిన క్షణం. ఈ సంక్లిష్ట శస్త్ర చికిత్సను విజయవంతం చేయడంలో వైద్యులు, నర్సులు, థెరపిస్టులు, సహాయక సిబ్బందితో సహా మొత్తం వైద్య బృందం కష్టం ఉంది" అని నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ దేవరాజ్ దేవిశెట్టి అభిప్రాయపడ్డారు.