Rameshwaram Cafe Blast : కర్ణాటక బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో జరిగిన ఘటనను బాంబు పేలుడుగా తేల్చారు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య. ఓ యువకుడు కేఫ్‌లోకి వచ్చి ఓ బ్యాగు పెట్టి కౌంటర్‌లో టోకెన్ తీసుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిందన్నారు. పోలీసులు కేఫ్ క్యాషియర్‌ను ప్రశ్నిస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిద్ధరామయ్య అన్నారు. అయితే ఈ ఘటనను రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలను కోరారు సీఎం. బీజేపీ ప్రభుత్వంలోనూ పేలుడు జరిగిందని గుర్తుచేశారు.
అయితే దీనిని తక్కువ తీవ్రత కలిగిన బాంబుగా గుర్తించామని చెప్పారు పోలీసు ఉన్నతాధికారులు. పేలుడు జరిగిన సమయంలో కేఫ్‌లో దాదాపు 40 మంది వరకు ఉన్నారని, ఈ ప్రమాదంలో హోటల్ సిబ్బంది సహా 10 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఇద్దరు సిబ్బంది కాగా మిగతావారు కస్టమర్లని చెప్పారు. అయితే ఎవరు కూడా తీవ్రంగా గాయపడలేదన్నారు. బ్యాగులో ఉన్న వస్తువు పేలడం వల్లే ఆ ఘటన జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరోవైపు ఫోరెన్సిక్ బృందాలు ఐఈడీ కారణంగానే ఆ పేలుడు సంభవించిందా అన్న విషయాన్ని నిర్ధరించేందుకు నమూనాలు సేకరిస్తున్నాయని రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక కోసం వేచి చూస్తున్నామని చెప్పారు.
'సిలిండర్ లీక్ వల్ల బ్లాస్ట్ జరగలేదు'
కేఫ్‌లో ఆరుగురు కస్టమర్లతో కలిసి కూర్చున్న ఓ మహిళ వెనకాల పేలిపోయిన హ్యాండ్‌బ్యాగ్ పడి ఉందని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ వెల్లడించారు. బ్యాగ్‌లోని అనుమానిత పదార్థం వల్లనే ఈ పేలుడు జరిగి ఉంటుందని అనుమానిస్తున్నట్లు ఆయన చెప్పారు. సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవ్వడం వల్ల పేలుడు జరగలేదన్న దానిపై ఓ స్పష్టతకు వచ్చినట్లు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ తెలిపారు. ఎక్కడా కూడా సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయిన ఆనవాళ్లు లేవన్నారు. టీ, కాఫీ తయారీకోసం వాడే మరో గ్యాస్ సిలిండర్‌ను కూడా పరిశీలించినట్లు చెప్పారు. దాని నుంచి కూడా ఎటువంటి గ్యాస్ లీక్ జరగలేదని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ స్పష్టం చేశారు.
మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పేలుడు జరిగినట్లు రామేశ్వరం కేఫ్ నుంచి పోలీసులకు సమాచారం అందినట్లు కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్ తెలిపారు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. బెంగళూరు పోలీసు కమిషనర్, ఇతర అధికారులు ప్రమాదస్థలంలోనే ఉండి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. బాంబు పేలుడుకు బాధ్యులెవరో త్వరలోనే తేలుస్తామన్నారు.