Ram Nath Kovind Report On One Nation One Election :దేశంలో శాసనసభ, పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశానికి సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ పలు సిఫార్సులు చేసింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏకకాల ఎన్నికల పునరుద్ధరణ. అంటే లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలని కమిటీ సూచించింది. ఒకవేళ పార్లమెంట్/అసెంబ్లీ ఫలితాల్లో హంగ్ ఏర్పడితే లేదా అవిశ్వాస తీర్మానం వంటి పరిస్థితులు తలెత్తితే కొత్త సభను ఏర్పాటు చేయడం కోసం ఐదేళ్లలో మిగిలిన కాలానికి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది.
ఏకకాల ఎన్నికల పునరుద్ధరణ
స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో నిర్వహించిన ఏకకాల ఎన్నికలను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని కోవింద్ కమిటీ ప్రధానంగా తన నివేదికలో ప్రస్తావించింది. ఏటా పలుమార్లు ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రభుత్వం, వ్యాపారాలు, కార్మికులు, కోర్టులు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, పౌర సమాజంతోపాటు వివిధ భాగస్వామ్య పక్షాలపై గణనీయమైన భారం పడుతోందని తెలిపింది. ఏకకాల ఎన్నికలు అభివృద్ధితోపాటు సామాజిక ఐక్యతకు దోహదం చేస్తాయని పేర్కొంది. అంతేకాకుండా ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడం, దేశ పౌరుల ఆకాంక్షలను సాకారం చేయడంలోనూ ఒకేసారి ఎన్నికలు సాయపడతాయని కమిటీ అభిప్రాయపడింది.
'100 రోజుల్లోపు ఆ ఎన్నికలు జరగాలి'
జమిలి ఎన్నికల నిర్వహణకు రెండంచెల విధానాన్ని కోవింద్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసింది. ముందుగా లోక్‌సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. రెండో దశలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోపు మున్సిపాలిటీలు, పంచాయతీలకు కూడా ఎన్నికలు జరపాలని కమిటీ తన నివేదికలో పేర్కొంది.
ఒకవేళ హంగ్ వస్తే?
ఒకవేళ హంగ్ పార్లమెంట్ లేదా అవిశ్వాస తీర్మానం వంటి పరిస్థితులే వస్తే మిగిలిన సభా కాలానికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ సలహా ఇచ్చింది. అంటే ఐదేళ్లలో మిగిలిన కాలపరిమితికి మాత్రమే రెండోసారి నిర్వహించే ఎన్నికలు వర్తిస్తాయి. అసెంబ్లీల విషయానికొస్తే కొత్తగా ఏర్పడిన లోక్‌సభ పదవీకాలం ముగిసేవరకు (ముందస్తుగా రద్దైతే తప్ప) కొనసాగుతాయి.