Raju Gari Kodi Pulao Making Process: సండే వచ్చిదంటే.. నాన్‌వెజ్ ప్రియులకు పండగ అన్నట్టే. చికెన్, మటన్, రొయ్యలు అంటూ నచ్చినట్లుగా చేసుకుంటుంటారు. ఇక చికెన్‌తో చేసే రెసిపీలకు లెక్కేలేదు. అయితే చికెన్‌తో ఎన్ని వంటకాలు ఉన్నా రాజుగారి కోడి పులావ్ లెక్కే వేరు. ఈ పులావ్ ముందు బిర్యానీ కూడా దిగదిడుపే అనేది పలువురి మాట. కారణం అంత టేస్ట్ ఉంటుందట. అయితే ఈ రెసిపీ అన్ని రెస్టరెంట్లలో దొరకదు. కొన్ని చోట్ల మాత్రమే దీనిని వండుతారు. మరి అలాంటి రాజుగారి కోడి పులావ్ ఈ టిప్స్‌తో ఇంట్లో చేస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..
కావలసిన పదార్థాలు:
- బాస్మతి బియ్యం - రెండు కప్పులు
- చికెన్ - అరకిలో
- జీడిపప్పులు - 10
- ఉల్లిపాయలు - 2(సన్నగా కట్ చేసుకోవాలి)
- నిమ్మరసం - అర స్పూను
- నూనె - తగినంత
- నెయ్యి - మూడు స్పూన్లు
- పెరుగు - పావు కప్పు
- యాలకులు - రెండు
- లవంగాలు - మూడు
- దాల్చిన చెక్క - చిన్న ముక్క
- అనాసపువ్వు - 1
- షాజీరా - అర స్పూను
- బిర్యానీ ఆకులు - రెండు
- జాపత్రి - అర స్పూన్
- కరివేపాకు - గుప్పెడు
- పచ్చిమిర్చి - ఐదు
- పచ్చిమిర్చి పేస్ట్ - ఒక స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
- పుదీనా ఆకులు - అరకప్పు
- కొత్తిమీర తరుగు - అర కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - 1 స్పూన్
- నీరు - సరిపడినంత
- గరం మసాలా - ఒక స్పూను
సండే స్పెషల్ - చికెన్ ఫ్రై విత్ మామిడికాయ పచ్చిపులుసు - కాంబినేషన్ అద్దిరిపోద్ది - మీరూ ఓ సారి ట్రై చేయండి! - Chicken Fry Recipe
రాజుగారి కోడి పులావ్ రెసిపీ తయారీ విధానం:
- చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. బాస్మతి బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి మూడు స్పూన్ల నెయ్యి, రెండు స్పూన్ల నూనె వేయాలి. అందులో జీడిపప్పులను దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
- అదే కుక్కర్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి.. ఆ తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేయించిన ఉల్లిపాయలు, పెరుగు, వేయించిన జీడిపప్పులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ వేసుకుని అందులోకి కొద్దిగా ఉప్పు, కారం, నిమ్మరసం, అర టీస్పూన్ గరం మసాలా, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లి పెరుగు కలిపి చేసిన పేస్టును వేసి బాగా కలిపి ఒక పావుగంట పాటు పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు ముందుగానే స్టవ్ మీద పెట్టుకున్న కుక్కర్లో నూనె, నెయ్యి ఇంకా మిగిలే ఉంటుంది. అందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, షాజీరా, జాపత్రి, బిర్యాని ఆకు వేసి వేయించుకోవాలి.
- అందులోనే మిగిలిన ఉల్లిపాయల తరుగు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
- ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. తర్వాత పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు వేసి బాగా వేయించుకోవాలి.
- ఇవన్నీ వేగాక ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్‌ను వేసి బాగా కలుపుకుని.. చిన్నమంట మీద ఉడికించుకోవాలి.
- కొద్దిసేపటి తర్వాత అందులో గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత నానబెట్టిన బాస్మతీ బియ్యం వేసి.. బియ్యం ఉడకడానికి సరిపడా నీటిని పోసి బాగా కలుపుకోవాలి.
- ఆపైన ఒక స్పూన్ నెయ్యిని వేయాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. కుక్కర్ ఆవిరి పోయాక మూత తీయాలి.
- అంతే ఎంతో టేస్టీ రాజుగారి కోడి పులావ్ రెడీ. దీన్ని చికెన్ కర్రీతో తింటే రుచి అదిరిపోతుంది.
వీకెండ్ స్పెషల్ - చింతచిగురు మటన్ ! ఇలా చేస్తే సూపర్ అనాల్సిందే! - Tamarind Leaves chicken
సండే స్పెషల్ : జింజర్ పెప్పర్ చికెన్ రెసిపీ - ఆహా ఏమి రుచి అంటారంతే! - Ginger Pepper Chicken Recipe