Vande Bharat Sleeper Coach Prototype Unveiled :వందే భారత్ స్లీపర్ రైళ్లను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రొటోటైప్ వెర్షన్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆవిష్కరించారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఎమ్‌ఈఎల్) ఫెసిలిటీలో వీటిని ప్రారంభించారు. బీఎమ్‌ఈఎల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వందే భారత్ తయారీ కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
వందే భారత్ చైర్ కార్ విజయవంతమైన తర్వాత, వందే భారత్ స్లీపర్ తయారీ ఇప్పుడే పూర్తయిందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పది రోజుల పాటు వీటిపై కఠినమైన ట్రయల్స్, టెస్ట్‌లు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇవి మరిన్ని పరీక్షల కోసం పట్టాలెక్కనున్నాయి. ఈ పరీక్షలు విజయవంతమైతే వీటి ఉత్పత్తి ప్రారంభంకానుంది. ఏడాదిన్నర తర్వాత నెలకు రెండు నుంచి మూడు చొప్పున వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి.
వందే భారత్ స్లీపర్ కోచ్‌ల్లో రీడింగ్ ల్యాంప్స్, ఛార్జింగ్ అవుట్‌లెట్‌లు, స్నాక్ టేబుల్, మొబైల్-మ్యాగజైన్ పెట్టుకునే సదుపాయాలు ఉంటాయి. రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే 'కవచ్' వ్యవస్థ ఉంటుంది. అన్ని కోచ్‌లు స్టెయిన్‌లెస్ స్టీల్ కార్ బాడీతో ఉంటాయి. జీఎఫ్ఆర్పీ ఇంటీరియర్ ప్యానెల్స్ ఉంటాయి, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన సదుపాయాలతో టాయిలెట్లు, కొత్త టెక్నాలజీతో రూపొందించిన సీటు కుషన్‌లు ఇందులో అమర్చారు. స్లీపర్ కోచ్ ఫీచర్లను వివరిస్తున్న రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (ANI) 16 కోచ్‌లు, 823 బెర్త్‌లతో వందే భారత్ స్లీపర్ రైలు రానుంది. వీటిలో 11, 3టైర్ ఏసీ కోచ్‌లు, 4, 2 టైర్ ఏసీ కోచ్‌లు, ఒక ఫస్ట్ టైర్ ఏసీ కోచ్ ఉంటుంది. 800 నుంచి 1200 కిలోమీటర్ల దూరం ఇవి ప్రయాణిస్తాయి. రైలులో ఉండే ఆక్సిజన్ స్థాయి వైరస్ నుంచి రక్షణ కలిగి ఉంటుంది. కొవిడ్ నుంచి పాఠాలు నేర్చుకున్న తర్వాత ఇలాంటి ఫీచర్లను ప్రవేశపెట్టారు. వందే భారత్ రైళ్లు మూడు వెర్షన్లలో రానున్నాయి. ఇవి మధ్యతరగతికి ఉద్దేశించినవి అని వీటి టికెట్ ధర రాజధాని ఎక్స్‌ప్రెస్ ధరకు సమానంగా ఉంటుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఛైర్‌కార్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య సేవలు అందిస్తున్నాయి. త్వరలో వందే మెట్రో రైలును కూడా తీసుకురానున్నట్లు సమాచారం. ఇక ఎక్కువ దూరం ప్రయాణించే వారికి మెరుగైన సదుపాయాలు అందించడం కోసం ఈ స్లీపర్ వెర్షన్‌ను కొన్ని నెలల్లోనే పట్టాలెక్కించనున్నారు.