Rail Coaches Convert Into Vande Bharat Standards :సార్వత్రిక ఎన్నికలకు ముందు 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇందులో రైల్వే శాఖకు రూ.2.55 లక్షల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థను మెరుగుపరిచేందుకు, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు 40 వేల సాధారణ బోగీలను వందే భారత్ ప్రమాణాలకు అనుగుణంగా మార్చనున్నట్లు ప్రకటించారు
ప్రయాణికులకు సురక్షితమైన రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా వందేభారత్ వంటి సెమీ-హైస్పీడ్ రైళ్లను ఇప్పటికే రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. విడతల వారికి వీటిని దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బోగీలను వందేభారత్ ప్రమాణాలకు అనుగుణంగా మార్చడం వల్ల సాధారణ ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలేమిటి? ఈ నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి వారికి ఇబ్బందులు వస్తాయా?
సురక్షిత ప్రయాణం
వందేభారత్ సెమీ-హైస్పీడ్ రైళ్లలో ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించారు. ప్రభుత్వం చెప్పినట్లు ఆ స్థాయిలో సాధారణ బోగీలను మార్చితే, ప్రజలు సౌకర్యంగా ప్రయాణాలు చేయగలుగుతారు. ప్రస్తుతం ఉన్న బోగీలతో పోల్చితే ప్రయాణికులు మరింత సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరవచ్చు.
మెరుగైన ప్రయాణ అనుభూతి
వందేభారత్ వంటి బోగీల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. వీటిలో సీట్ల కింద మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి. టాయిలెట్లో లైటింగ్‌ను మెరుగుపరిచారు. అంతేకాకుండా వాష్ బేషిన్ సైజ్‌లు పెంచారు. టాయిలెట్ హ్యాండిల్స్, వాటర్ ట్యాప్‌లు వంటి వాటిలో కూడా మార్పులు చేశారు. ప్రయాణ సమయంలో మరింత సౌకర్యవంతంగా ఉండే విధంగా సీటును రిక్లైన్ చేసుకోవచ్చు. దివ్యాంగుల వీల్‌ఛైర్ కోసం ప్రత్యేక పాయింట్‌ను ఏర్పాటు చేసి అక్కడే వారికి సీటు కేటాయించారు. ప్రయాణికులకు మెరుగైన ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ కూడా ఉంది. ఇలాంటి ఆధునిక ఫీచర్లు కలిగిన బోగీల్లో మంచి ప్రయాణ అనుభూతి కలుగుతుంది.