తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'400మంది మహిళలపై ప్రజ్వల్​ రేవణ్ణ అత్యాచారం- మోదీ క్షమాపణ చెప్పాలి' - Rahul Gandhi On Hasan Sex Scandal

Rahul Gandhi On Hasan Sex Scandal : మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు ప్రజ్వల్​ రేవణ్ణ, 400మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరోపించారు. ఆయన తరఫున ఓట్లు అడిగినందుకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Rahul Gandhi On Hasan Sex Scandal
Rahul Gandhi On Hasan Sex Scandal

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 3:24 PM IST

Updated : May 2, 2024, 4:05 PM IST

Rahul Gandhi On Hasan Sex Scandal :మాజీ ప్రధాని హెచ్​డీ దేవెగౌడ మనవడు, హాసన్ లోక్​స​భ స్థానం జేడీఎస్ అభ్యర్థి ప్రజ్వల్​ రేవణ్ణ, 400 మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ సంచలన ఆరోపణ చేశారు. అంతేకాకుండా ఆ అఘాయిత్యాన్ని చిత్రీకరించారని ఆరోపణలు గుప్పించారు. అలాంటి ప్రజ్వల్​ రేవణ్ణకు ఓట్లు వేయండి అని అడిగిన ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. కర్ణాటకలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాహుల్.

"ప్రధానమంత్రి భారత తల్లులు, సోదరీమణులకు క్షమాపణ చెప్పాలి. ప్రజ్వల్ రేవణ్ణ 400 మహిళలపై అత్యాచారానికి పాల్పడి, వీడియోలు తీశాడు. ఇది సెక్స్​ కుంభకోణం కాదు, సామూహిక అత్యాచారం"
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

ప్రజ్వల్ అరెస్ట్​ అనివార్యం! : కర్ణాటక హోం మంత్రి
ప్రజ్వల్​ రేవణ్ణ విదేశాలకు వెళ్లినట్లు తెలిసిన వెంటనే లుకౌట్​ నోటీసు జారీ అయిందని, దీని గురించి అన్ని ఓడరేవులు, విమానాశ్రయాలకు తెలియజేశామని కర్ణాటక హోం మంత్రి డాక్టర్​ జీ పరమేశ్వర గురువారం తెలిపారు. 'తాను విదేశాల్లో ఉన్నందున సిట్​ ముందు హాజరు కాలేనని, మరో ఏడు రోజులు ప్రజ్వల్​ గడువు ప్రజ్వల్​ కోరారు. ఈ విషయంపై సిట్​ బృందం న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటోంది. అయితే 24 గంటలకు మించి సమయం ఇవ్వడానికి ఎలాంటి నిబంధన లేదు. కనుక సిట్​ బృందం ప్రజ్వల్​ను అరెస్టు చేసే అవకాశం ఉంది.' అని మంత్రి వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశామని మంత్రి పరమేశ్వర చెప్పారు. ఈ క్రమంలో మరో మహిళ ఫిర్యాదు చేశారని, వారి వివరాలను బహిర్గతం చేయలేమని అన్నారు.

'ఈ కేసులో చాలా కోణాలున్నాయ్'
మరోవైపు, హాసన్ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించిన సెక్స్‌ కుంభకోణం కేసులో సిట్‌ దర్యాప్తును వేగవంతం చేసింది. జర్మనీలో ఉన్న ప్రజ్వల్‌పై లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేసింది. కేసులో చాలా కోణాలున్నాయనీ, భారత్‌కు రావడానికి 7 రోజులు పడుతుందన్న ప్రజ్వల్‌ విజ్ఞప్తిని సిట్‌ తిరస్కరించిన నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. ప్రజ్వల్‌ మైనర్లనూ వేధించాడన్న ఆరోపణలు రావడం వల్ల ఆ సాక్ష్యాల సేకరణలో కూడా సిట్‌ నిమగ్నమైంది. పనిమనిషి అయిన బాధితురాలి కుమార్తెకూ వీడియో కాల్‌ చేసి అసభ్యంగా ప్రజ్వల్‌ ప్రవర్తించినట్లు సమాచారం. ఇది రుజువైతే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తామని సిట్‌కు నేతృత్వం వహిస్తున్న IPS అధికారి BK సింగ్‌ చెప్పారు. పలు వీడియోల్లో ప్రజ్వల్‌తోపాటు మహిళల ముఖాలు స్పష్టంగా కనిపించాయన్నారు. ఇప్పటికే పనిమనిషి వాంగ్మూలాన్ని నమోదు చేశామనీ, ఆమె ఫిర్యాదు మేరకు విచారణ జరుగుతుందన్నారు. ప్రజ్వల్‌ను వెనక్కి రప్పించేందుకు సిట్ ప్రయత్నాలను ముమ్మరం చేసిందని, ఆయన రాకపోతే అక్కడే అరెస్టు చేస్తారని కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర తెలిపారు. దర్యాప్తు విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశారు.

'గెస్ట్​హౌస్​కు పిలిపించుకునేవాడు'
వీడియోల్లో ప్రజ్వల్‌తో కనిపించిన యువతులు, మహిళల వివరాలను పోలీసులు, సిట్ అధికారులు గుర్తించారు. తమకు ఫిర్యాదు ఇస్తే ప్రజ్వల్‌పై చర్యలు తీసుకుంటామని వారికి సూచించారు. ఉద్యోగాలు, పదోన్నతులు, బదిలీల వంటి అవసరాల కోసం ప్రజ్వల్‌ను ఆశ్రయించడం వల్ల తమ విషయం బయటకు తెలియకుండా ఉంచేందుకే మహిళలు గోప్యత పాటిస్తున్నట్లు తెలిసింది. సంసారం కూలిపోతుందన్న భయంతో సిట్‌కు ఎవరూ ఫిర్యాదు చేయడంలేదు. తమను సంప్రదించవద్దని ఎక్కువమంది మహిళలు సిట్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రజ్వల్‌ నివాసంలో పని చేసిన పనిమనిషి మినహా మరెవరూ ఆయనపై ఫిర్యాదు చేయలేదు. హాసన్​తో పాటు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న తన గెస్ట్‌హౌస్‌నే ప్రజ్వల్‌ వినియోగించుకున్నాడని, అక్కడే మహిళలను రప్పించుకునేవాడని ప్రాథమికంగా సిట్‌ గుర్తించింది.

'శుక్రవారం భారత్​కు ప్రజ్వల్​ రేవణ్ణ'
వీడియోలు వెలుగు చూసిన వెంటనే జర్మనీకి వెళ్లిపోయిన నిందితుడు ప్రజ్వల్‌ శుక్రవారం రాత్రికే బెంగళూరుకు తిరిగి రానున్నారని ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు, మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ ప్రకటించారు. ప్రజ్వల్‌ 3 నెలలు జర్మనీలో ఉండే అవకాశం ఉన్నా, సిట్ దర్యాప్తు నేపథ్యంలో వెనక్కు తిరిగి వస్తున్నారని హెచ్‌డీ రేవణ్ణ తెలిపారు. కేసులో ఏ1 గా హెచ్‌డి రేవణ్ణ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాను ఎటువంటి తప్పు చేయలేదని హెచ్‌డీ రేవణ్ణ చెబుతున్నారు. తనపై, తన కుటుంబంపై కుట్ర జరిగిందనీ దర్యాప్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.

జనం లేక రెవణ్ణ నివాసం వెలవెల
ఆరోపణలు తీవ్రమైనవి కావడం వల్ల హొళెనరసీపురలోని రేవణ్ణ నివాసం జనం లేక వెలవెలబోతోంది. కార్యకర్తలు ముఖం చాటేశారు. ప్రజ్వల్‌ ఎంపీ కావడం, ఆయన కుటుంబీకులంతా రాజకీయ నేపథ్యం ఉన్నవారు కావడంత వల్ల విదేశాల్లోనూ ఈ కేసు మారుమోగిపోతోంది. యువతులు, మహిళలను ప్రజ్వల్‌ లైంగిక అవసరాలకు వాడుకున్నాడంటూ పలు విదేశీ మాధ్యమాలు ప్రసారం చేశాయి.

మోదీపై ప్రియాంక ఫైర్
బీజేపీ మిత్రపక్షమైన జేడీఎస్‌కు చెందిన ఎంపీ ప్రజ్వల్‌ విషయంపై కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ విమర్శలు చేశారు. ఈ అంశంపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజ్వల్‌ భుజాలపై మోదీ చేతులు వేసి ఫొటోలు దిగారనీ, ఆయన కోసం ప్రచారం చేయడమే కాక వేదికపై ప్రజ్వల్‌ను పొగిడారని ప్రియాంక గుర్తుచేశారు. క్రూరమైన నేరాలు చేసి దేశం నుంచి పారిపోయిన ప్రజ్వల్‌ గురించి ఎందుకు మాట్లాడట్లేదని మోదీని ప్రియాంక నిలదీశారు.

ప్రజ్వల్​ పారిపోయేందుకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది : అమిత్​ షా
మరోవైపు ప్రజ్వల్‌ రేవణ్ణ వ్యవహారంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడే వారికి బీజేపీ వ్యతిరేకమన్నారు. ఒక్కలిగలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజ్వల్‌ రేవణ్ణపై చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు వేచి చూసిందని అమిత్‌ షా విమర్శించారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ సర్కారు ఈ అంశంలో రాజకీయం చేసి ప్రజ్వల్‌ రేవణ్ణ విదేశాలకు పారిపోయేందుకు అవకాశం ఇచ్చిందని అమిత్‌ షా దుయ్యబట్టారు.

హసన్​ సెక్స్‌ కుంభకోణంలో ఎన్నో దారుణాలు! తొలిసారి స్పందించిన ప్రజ్వల్​ - Prajwal Revanna Sex Scandal Case

హాసన్​ సెక్స్ రాకెట్​లో షాకింగ్ నిజాలు- ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్నపై వేటు! - Prajwal Revanna Suspension From JDS

Last Updated : May 2, 2024, 4:05 PM IST

ABOUT THE AUTHOR

...view details