Rahul Gandhi Letter To Wayanad : వయనాడ్ నియోజకవర్గాన్ని వదిలిపెట్టడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడి ప్రజలకు భావోద్వేగంతో ఓ లేఖ రాశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్ 2చోట్లా రాహుల్ గెలుపొందారు. తాను విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో వయనాడ్ ప్రజల ప్రేమాభిమానాలే తనను కాపాడాయన్నారు. తనకు ఆశ్రయం కల్పించి, ఓ కుటుంబసభ్యుడిలా చూసుకున్నారని కొనియాడారు. వయనాడ్‌ను వదులుకునే నిర్ణయాన్ని మీడియాకు చెప్పేందుకు చాలా బాధపడినట్టు రాహుల్ తెలిపారు. వయనాడ్ ప్రజలంతా తన కుటుంబసభ్యులని ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటానని రాహుల్ హామీ ఇచ్చారు.
"డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ వయనాడ్ మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నేను నా నిర్ణయాన్ని మీడియా ఎదుట చెప్పేటప్పుడు నా కళ్లల్లో బాధను మీరంతా చూసే ఉంటారు. నేను ఎందుకు అంత బాధపడ్డానో తెలుసా? మీ మద్దతు కోరుతూ ఐదేళ్ల క్రితం మిమ్మల్ని కలిశాను. అప్పటికి నేను మీకు పెద్దగా పరిచయం లేను. అయినా మీరు నాపై నమ్మకం ఉంచి గెలిపించారు. అవధుల్లేని ప్రేమాభిమానాలు కురిపించారు. మీరు ఏ వర్గానికి చెందిన వారైనా, ఏ రాజకీయ పార్టీకి మద్దతిచ్చినా, నేను వేధింపులు ఎదుర్కొంటున్న సమయంలో అండగా నిలిచారు. మీ ప్రేమే నన్ను రక్షించింది. కేరళలో వరదల సమయంలో ఎదురైన పరిస్థితులను ఎప్పటికీ మర్చిపోలేను. ఎన్నో కుటుంబాలు తమ జీవితాలను కోల్పోయినా, యావదాస్తులు గంగలో కొట్టుకుపోయినా మీలో ఒక్కరు కూడా హుందాతనాన్ని కోల్పోలేదు. మళ్లీ నన్ను గెలిపించారు. మీ ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకుంటా. వేలాది మంది ప్రజల ఎదుట నా ప్రసంగాలను అనువాదం చేసిన ధైర్యసాహసాలు కలిగిన ధీర యువతుల విశ్వాసాన్ని ఎలా మర్చిపోగలను? పార్లమెంట్‌లో మీ తరఫున మాట్లాడటం నిజంగా ఎంతో సంతోషాన్ని, గౌరవాన్ని ఇచ్చింది"
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత