Jammu Kashmir Election 2024 :జమ్ముకశ్మీర్‌లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కృషిచేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. జమ్ములోని రాంబన్ జిల్లా బనిహాల్‌లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను బీజేపీ లాగేసుకుందని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న రాహుల్, ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచుతామని తెలిపారు. ఒప్పంద కార్మికులను క్రమబద్ధీకరిస్తామన్న ఆయన పాలనలో మిత్రపక్షాలను కలుపుకుని ముందుకుసాగుతామని పేర్కొన్నారు.
''అధికారంలోకి వచ్చాక జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు మొదటి అడుగు వేస్తాం. ఎన్నికలకు ముందే మీకు రాష్ట్ర హోదా రావాలని మేం కోరుకున్నాం. రాష్ట్ర హోదా వచ్చిన తర్వాత ఎన్నికలు జరగాలని భావించాం. కానీ బీజేపీ అలా అనుకోవడం లేదు. మొదట ఎన్నికలు, తర్వాత రాష్ట్ర హోదా అంశం ఆలోచిద్దాం అని బీజేపీ అనుకుంటోంది. ఏదీ ఏమైనా సరే జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను మేం సాధిస్తాం. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందేనని ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది.'' అని రాహుల్ గాంధీ అన్నారు.
'మేము ఇద్దరు - మా ఇద్దరు'
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీలో విశ్వాసం సన్నగిల్లిందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో పాటుగా వారి కార్పొరేట్ మిత్రులు నడుపుతున్నారని ఆరోపించారు. మోదీ కార్పొరేట్ మిత్రులైన అదానీ, అంబానీల పేర్లును లోక్ సభలో వాడకూడదని అన్నారని గుర్తుచేశారు. అందుకని వారిని A1 - A2 పేర్లతో సంభోదించినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం 'మేము ఇద్దరు, మా ఇద్దరు' అనుకుంటుందని ఎద్దేవా చేశారు. మోదీ, షా, అంబానీ, అదానీ ఈ నాలుగు శక్తులే ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని ఆరోపించారు. బిలియనీర్లకు లబ్ధి చేకూర్చడం కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేశారని మండిపడ్డారు. అనంతరం జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాతో దోచుకున్నారని రాహుల్ విమర్శించారు.