Rahul Gandhi Fires On Pm Modi :ఈవీఎమ్‌లు, ఈడీ, సీబీఐ లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల గెలవలేరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆదివారం ముంబయిలో జరిగిన భారత్ జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్ ప్రసంగించారు. మోదీ శక్తి కోసం ఒక ముసుగు అని అన్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ నాయకుడు తన తల్లి సోనియా గాంధీ వద్దకు వచ్చి ఏడ్చాడని, ఈ శక్తితో తాను పోరాడలేనని, అలా చేసి జైలుకు వెల్లడం ఇష్టం లేదని బాధపడ్డాడని రాహుల్ చెప్పారు. మోదీ 56 అంగుళాల ఛాతీ లేని నిస్సార మనిషి అని విమర్శించారు. నరేంద్ర మోదీకి అవినీతిపై గుత్తాధిపత్యం ఉందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. సమాజంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ద్వేషాన్ని ఎత్తిచూపడానికి తాను భారత్ జోడో యాత్రలను ప్రారంభించాల్సి వచ్చిందని తెలిపారు.
'ఈవీఎమ్లలో దేశ రాజు ఆత్మ ఉంది'
ఈ దేశ రాజు ఆత్మ ఈవీఎమ్లలో ఉందని (ప్రధాని మోదీని ఉద్దేశించి) రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. మరోసారు ఈవీఎమ్‌లను ఉపయోగించుకుని అధికారంలోకి రావాలని వారు అనుకుంటున్నారని ఆరోపించారు. అయితే ఈవీఎమ్కు ఉండే వీవీప్యాట్ రశీదు చాలా ముఖ్యమని అన్నారు. VVPATని కూడా లెక్కించమని మేము భారత ఎన్నికల సంఘాన్ని కోరామని, కానీ మా డిమాండ్ అంగీకరించలేదని తెలిపారు.
'దేశం కొందరి చేతుల్లో ఉంది'
దేశం కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిందని రాహుల్ గాంధీ అన్నారు. దేశం కేవలం 23 మంది పారిశ్రామికవేత్తలు, 90 మంది అధికారుల చేతుల్లో నడుస్తోందని విమర్శించారు. ఇందులో పేద దళితులు, గిరిజనులు ఎవరూ కనిపించరని, దేశంలో నియంతృత్వం మాత్రమే కొనసాగుతోందని మండిపడ్డారు. 'ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరినా దాని గురించి మోదీ ఏమీ మాట్లాడరు. దానికి తోడు మీ దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తారు. 'అప్పుడు పాకిస్థాన్ లో ఏం చేశారో చూడు', 'చైనాకు ఏం చేశారో చూడు' అని అంటూనే ఉంటారు. కానీ ఈ దేశంలోని పేద రైతుల వైపు చూసే సమయం వారికి లేదు.' అని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ప్రజలను తప్పుదోవ పట్టించడమే మోదీ పని'
ప్రజలను తప్పుదోవ పట్టించడంలో మోదీ ప్రసిద్ధి రాహుల్ గాంధీ విమర్శించారు. 'దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోంది. చైనాతో సహా దేశంలోని పారిశ్రామికవేత్తలకు దేశ సొమ్ము చేరుతోంది. ధారావి అభివృద్ధికి మోదీ అనుమతి ఇవ్వడం లేదు. నేను మోదీ, ఈడీకి భయపడను. వారు నన్ను 50 గంటల పాటు ప్రశ్నించారు. ఇలా ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. మోదీకి అవినీతి కళలో ఆరితేరారు.
'నఫ్రత్ బాజార్మే మహబ్బత్ కీ దుకాణ్'
పెద్దనోట్ల రద్దు వల్ల ఉద్యోగాల కోల్పోయారని రాహుల్ గాంధీ అన్నారు. కొన్ని కంపెనీల కోసం చిరు వ్యాపారులను ప్రభుత్వం చంపేస్తోందని ఆరోపించారు. ఇది ప్రేమకు నిలయం అని, అందరూ విద్వేష మార్కెట్లో ప్రేమ దుకాణం తెరవాలని పిలుపునిచ్చారు.