Puri Ratna Bhandar Open :పూరీ జగన్నాథుడి రత్నభాండాగారంలోని మూడో గది ఈ నెల 18న మళ్లీ తెరుచుకోనుంది. 46ఏళ్ల తర్వాత తొలిసారి, ఈ 14న రహస్య గదిని తెరిచిన అధికారులు సాయంత్రం కావడం వల్ల ఏమీ పరిశీలించకుండానే గదికి సీల్ వేసి బయటకు వచ్చేశారు. రహస్య గదిలో గోడకు ఐదు అల్మారాలు ఉన్నాయని, ఆభరణాలు ఉన్న కొన్ని పెట్టెలు పడి ఉండటాన్ని చూశామని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. అల్మారాలు, పెట్టెలు తెరవనందున రహస్య గదిలో సొరంగ మార్గం ఉందో లేదో తాము స్పష్టత ఇవ్వలేమని తెలిపారు.
మళ్లీ రహస్య గది ఓపెన్
ఈ క్రమంలో ఈ నెల 18న మళ్లీ ఆ రహస్య గదిని తెరిచి ఆభరణాలను తరలించనున్నారు. వాటిని ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్‌రూంలో భద్రపరుస్తారు. గురువారం ఉదయం 9గంటల 51 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల మధ్య ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ చెప్పారు. ఆభరణాలన్నిటినీ తరలించాకే పురావస్తుశాఖ అధికారులను రహస్య గది లోపలికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఏఎస్ఐ అధికారులు, రహస్య గది నిర్మాణ భద్రతను సమీక్షిస్తారని జస్టిస్ రథ్ వివరించారు. ఈ ప్రక్రియలను అంతా వీడియోగ్రాఫ్ చేస్తామని వివరించారు. రహస్యగదిని తెరిచే రోజున ఆలయంలో కొన్ని ఆంక్షలు ఉంటాయని, వాటిని భక్తులు తప్పనిసరిగా పాటించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తిచేశారు.