Pune Car Accident Case : రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని పుణెలో మైనర్ చేసిన ఓ రోడ్డు ప్రమాదం కలకలం రేపుతోంది. మైనర్ దురుసు డ్రైవింగ్ రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. అతిగా మద్యం తాగి 200 కిలోమీటర్ల వేగంతో కారులో దూసుకొచ్చిన మైనర్, బైక్‌పై వెళ్తున్న టెకీలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన అనీశ్, అశ్విని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మైనర్ చేసిన తప్పునకు ఇద్దరు సాప్ట్‌వేర్ ఇంజనీర్లు కన్నుమూయడం తీవ్ర ఆవేదనను మిగిల్చింది. అయితే ఈ కేసులో మైనర్‌కు కోర్టు కేవలం 15 గంటల్లోనే బెయిల్ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బాధిత కుటుంబం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అనీశ్, అశ్విని మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇది ప్రమాదం కాదని హత్య అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటన జరిగిన 15 గంటల్లోనే నిందితుడికి బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మైనర్‌కు విధించిన బెయిల్ షరతులు తమను తీవ్రంగా బాధించాయని తాము న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తామని బాధిత కుటుంబాలు తెలిపాయి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినా నిందితుడికి 15 గంటల్లో బెయిల్ రావడంపై బాధిత కుటుంబ సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు.
కారు ఇచ్చినందుకే అరెస్ట్
అయితే నిందితుడిని మేజర్‌గా పరిగణించి దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరగా, న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. బెయిల్ నిరాకరించడానికి కారణాలు కనిపించడం లేదని కోర్టు పేర్కొంది. తమ అభ్యర్థనను పరిగణించాల్సిందిగా సెషన్ కోర్టును ఆశ్రయిస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో మైనరైన తన కుమారుడికి కారు ఇచ్చిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదం రోజు రాత్రి మైనర్‌కు మద్యం అమ్మిన బార్ ఓనర్, మేనేజర్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై జువైనల్ జస్టిస్ యాక్టు కింద నమోదైన కేసు ఆధారంగా పోలీసులు ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తును క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశారు.