Priyanka Gandhi Oath : కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వయనాడ్ ఎంపీగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రియాంకతో ప్రమాణం చేయించారు. రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ఆమె ప్రమాణం చేశారు. ఈ సంద్భంగా ప్రియాంక గాంధీకి పలువురు అభినందనలు తెలిపారు. అంతకుముందు, ఎంపీగా తొలిసారిగా పార్లమెంట్‌లోకి అడుగుపెడుతున్న తన సోదరి ప్రియాంక గాంధీని ఆపి, రాహుల్ గాంధీ తన ఫోన్‌తో ఫొటో తీశారు. దీంతో అక్కడ కాసేపు సరదా వాతావరణం నెలకొంది. కాగా, ప్రియాంక గాంధీ ఎంపీగా తన జర్నీ ప్రారంభించడంపై సోనియాంగా సంతోషం వ్యక్తం చేశారు. గర్వంగా ఉందని చెప్పారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రం చేసిన ప్రియాంక గాంధీ, తొలి అడుగులోనే భారీ విజయాన్ని అందుకున్నారు. నవంబర్ 13న కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో తన సమీప ప్రత్యర్థిపై 4,10,931 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఇదే స్థానంలో ప్రియాంక సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన (3.64 లక్షలు) మెజారిటీని ఆమె అధిగమించడం విశేషం.
పార్లమెంట్లో ముగ్గురు గాంధీలు
ఎంపీ హోదాలో ప్రియాంక గాంధీ మొదటిసారి లోక్‌సభలోకి ప్రవేశించారు. దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించిన గాంధీ కుటుంబంలోని మూడో వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇదివరకు ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు ఒకేసారి ముగ్గురు గాంధీ కుటుంబ సభ్యలు చట్టసభల్లో ఉన్నారు. ఇప్పటికే సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా, రాహుల్ లోక్‌సభ సభ్యుడుగా ఉన్నారు. తాజాగా ప్రియాంక గాంధీ పార్లమెంట్లో అడుగు పెట్టారు.
ప్రచారం టు ఎంపీ
ప్రియాంక గాంధీ 1972 జనవరి 12న జన్మించారు. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రియాంక గాంధీ 1997లో రాబర్ట్ వాద్రాను పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2019 జనవరి 23న ప్రియాంక గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటి వరకు ఆమె పరోక్షంగా కుటుంబ సభ్యులకు ప్రచారం చేస్తూ వస్తున్నప్పటికీ, అధికారికంగా పార్టీ బాధ్యతలు చేపట్టడం అదే మొదటి సారి. తొలుత తూర్పు ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌కు పూర్తి ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో ఆమె విస్తృతంగా పర్యటించి, ప్రచారం చేసినా కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా నిరంతరం ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రజా సమస్యలపై ఆందోళనలు, ఉద్యమాలు చేస్తూ వచ్చారు.