Jamili Election Bill JPC : జమిలి ఎన్నికల బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపేందుకు ప్రభుత్వం సిద్ధమైన వేళ జేపీసీలో తమ తరఫు నుంచి ప్రాతినిధ్యం వహించే సభ్యుల పేర్లను పార్టీలు ఖరారు చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ పేరును ప్రతిపాదించినట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రియాంకతో పాటు మనీష్ తివారీ, సుఖ్‌దేవ్ భగత్, రణదీప్ సూర్జేవాలా పేర్లను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసినట్లు సమాచారం. బీజేపీ నుంచి ఎంపీలు రవిశంకర్ ప్రసాద్, నిశికాంత్ దుబే పేర్లును ప్యానెల్ సభ్యులుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ కూడా జేపీసీకి ఇద్దరి పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. లోక్‌సభ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ, రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే పేర్లను జేపీసీకి పంపనున్నట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి. శివసేనకు చెంది శ్రీకాంత్ శిందే, జేడీయూ నుంచి సంజయ్ ఝా, డీఎంకే తరఫున టీఎం సెల్వగణపతి, పీ విల్స్న్ ఉన్నారు.
బిల్లుపై అధ్యయనం చేయడానికి కమిటీలో 31మంది ఎంపీలు ఉంటారని, అందులో లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10మంది ఉండనున్నట్లు సమాచారం. విపక్షాల తీవ్ర వ్యతిరేకత మధ్య లోక్‌సభ, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే రెండు బిల్లులను కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వాటిని జేపీసీకి పంపాలంటే ముందు లోక్‌సభ తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జేపీసీని స్పీకర్ ఏర్పాటు చేస్తారు.
మంగళవారం జమిలి బిల్లును లోక్‌సభ పరిగణనలోకి తీసుకోవడంపై విపక్ష సభ్యులు ఓటింగ్ కోరారు. ఇందుకు అంగీకరించిన స్పీకర్ హైబ్రిడ్ విధానంలో ఓటింగ్ నిర్వహించారు. 360 మంది ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో, మరికొందరు బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు. దీనితో జమిలి ఎన్నికల బిల్లులు ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ ఆమోదం లభించినట్లు అయ్యింది. ఈ బిల్లుపై ఎన్డీఏ మిత్ర పక్షాలు పూర్తి మద్దతును ప్రకటించాయి. కానీ కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పూర్తి స్థాయిలో చర్చ జరిగేందుకు వీలుగా ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించారు.