PM Modi Meets President Murmu : ప్రభుత్వ ఏర్పాటుకు తమను రాష్ట్రపతి ఆహ్వానించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. శుక్రవారం ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. ఈ సందర్భంగా తనకు ఆహ్వాన లేఖను అందజేసినట్లు మోదీ తెలిపారు. సమావేశం అనంతరం రాష్ట్రపతి భవన్ బయట మోదీ మీడియాతో మాట్లాడారు.
"ఆజాదీ కా అమృత్ ఉత్సవాల తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవి. దేశానికి మరింత సేవ చేయాలని ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. దేశ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తాం. ప్రజల ఆకాంక్షల మేరకు మరింత ఉత్సాహంగా పని చేస్తాం. ఈరోజు ఉదయమే ఎన్డీఏ నేతలంతా కలిసి చర్చించాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలని రాష్ట్రపతి నన్ను ఆహ్వానించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం గురించి ఆమె ఆరా తీశారు. జూన్ 9 సాయంత్రం ప్రమాణం చేస్తానని తెలిపాను. దీనికి సంబంధించిన ప్రక్రియ కోసం రాష్ట్రపతి భవన్ ఏర్పాట్లు చేసుకుంటుంది. మంత్రివర్గ సభ్యుల పేర్లను త్వరలోనే రాష్ట్రపతికి పంపిస్తాం. ఆ తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది."
-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
రాష్ట్రపతితో ఎన్డీఏ నేతల సమావేశం
మరోవైపు ఎన్డీఏ కూటమి నేతలు రాష్ట్రపతిని కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమారు, శివసేన అధ్యక్షుడు ఏక్నాథ్ శిందే సమావేశమయ్యారు. వీరంతా ఎన్డీఏకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను, తమ పార్టీల మద్దతు లేఖలను సమర్పించారు.
మోదీ ప్రమాణ స్వీకారం టైమ్ ఫిక్స్!
మరోవైపు, వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుందని బీజేపీ నేత ప్రహ్లాద్ జోషీ తెలిపారు. అయితే మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జూన్ 8వ తేదీన జరుగుతుందని ఊహాగానాలు వచ్చాయి. కానీ తొమ్మిదో తేదీనే జరగనున్నట్లు వెల్లడించారు.
భద్రతా వలయంలోకి రాష్ట్రపతి భవన్
ప్రధాని ప్రమాణ స్వీకారం నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. 5 కంపెనీల పారామిలటరీ బలగాలు, ఎన్ఎస్జీ కమాండోలు, డ్రోన్లు, స్నైపర్లతో రాష్ట్రపతి భవన్లో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. అనేక మంది అతిథులు హాజరు కానున్న నేపథ్యంలో సుమారు 2,500 మందితో భద్రతను ఏర్పాటు చేశామని చెప్పారు.
విదేశీ నేతలతో పాటు ప్రత్యేక అతిథులు!
2014లో మోదీ మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో సార్క్(SAARC) దేశాల అధినేతలు హాజరయ్యారు. 2019లో బిమ్స్‌టెక్ (BIMSTEC) దేశాల నాయకులు ప్రమాణస్వీకారానికి వచ్చారు. ఈసారి బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ సహా పలు దేశాల అధినేతలు రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమకు ఆహ్వానం అందినట్లు శ్రీలంక అధ్యక్షుడి మీడియా కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమానికి వీరితో పాటు కూటమి నాయకులు, ప్రతిపక్ష సభ్యులు, సినీ, క్రీడారంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సహా మరికొంత మందిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ జాబితాలో పలువురు ట్రాన్స్‌జెండర్లు, కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి పని చేసిన శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ రైళ్లు వంటి కీలక ప్రాజుక్టుల్లో పని చేసిన వారికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. భారత దేశాభివృద్ధికి తోడ్పడుతున్న వీరందరినీ మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇప్పటికే వివిధ దేశాధినేతలు తమకు ఆహ్వానాలు అందినట్లుగా ప్రకటించారు.
ఎన్డీఏ పక్షనేతగా మోదీ ఎన్నిక
శుక్రవారం ఉదయం ఎన్డీఏ లోక్‌సభా పక్షనేతగా ప్రధాని మోదీని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించారు. రాజ్‌నాథ్ ప్రతిపాదనను బీజేపీ నేతలు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి బలపరిచారు. ఈ క్రమంలో ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఎన్నుకున్నారు. అలాగే మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఎన్డీఏ కూటమిలోని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేశాయి.
ఇటీవల విడుదలైన లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాల్లో ఎన్డీఏ 293 సీట్లు సాధించింది. మెజారిటీ మార్కు 272ను కంటే ఎక్కువ సీట్లు రావడం వల్ల కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వరుసగా మూడోసారి అధికారం చేపట్టనుంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ మార్కును దాటలేకపోయింది. దీంతో మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో చకచకా పావులు కదిపి ఎన్డీఏ పక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
మోదీ నాయకత్వానికి ఆమోదముద్ర- ఆ విషయంలో చాలా కష్టపడ్డారన్న చంద్రబాబు! - NDA MPs Meet In Parliament
ప్రతి నిర్ణయంలో ఏకాభిప్రాయం సాధించడమే లక్ష్యం- ఇక NDA అంటే అదే: మోదీ - Narendra Modi Speech At NDA Meet