Independence Day 2024 Droupadi Murmu : 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. భారతదేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం స్థిరమైన పురోగతి సాధించిందన్నారు. ఇది సామాజిక ప్రజాస్వామ్యం పురోగతిని ప్రతిబింబిస్తుందని నొక్కి చెప్పారు. దేశం దాని భిన్నత్వంలో ఏకత్వంపై అభివృద్ధి చెందుతుందని, ఒక సంఘటిత శక్తిగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం అనేక చర్యలు ప్రారంభించిన మోదీ ప్రభుత్వం, సామాజిక న్యాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.
'అందరినీ భాగస్వామ్యులను చేయాలనే స్ఫూర్తి మన సామాజిక జీవితంలోని ప్రతి అంశంలోనూ ఉంది. మన వైవిధ్యం, బహుళత్వంతో మనం ఒక సమ్మిళిత దేశంగా కలిసి కదులుతాం. దీని దిశగా తప్పనిసరిగా బలోపేతం కావాలి' అని ముర్ము పిలుపునిచ్చారు. విశాలమైన దేశంలో, సామాజిక అంతరాలు ఆధారంగా అసమ్మతిని రేకెత్తించే ధోరణులను తిరస్కరించవలసి ఉంటుందని గట్టిగా నమ్ముతున్నట్లు రాష్ట్రపతి తెలిపారు.
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి
పేదల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే ప్రధాన్ మంత్రి సామాజిక్ ఉత్థాన్ ఏవం రోజ్ గార్ ఆధారిత్ జనకళ్యాణ్ (PM-SURAJ), ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM-JANMAN) సహా అట్టడుగు వర్గాల కోసం తీసుకొచ్చిన అనేక ప్రభుత్వ కార్యక్రమాలను ముర్ము వివరించారు. ముఖ్యంగా గిరిజనుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం కోసం తీసుకొచ్చిన స్కీమ్‌లను ప్రస్తావించారు. పారిశుద్ధ్య కార్మికులు ప్రమాదకర పనుల్లో పాల్గొనకుండా చూసుకోవడం, వ్యర్థాలను మానవులు తొలగించకుండా రక్షించేందుకు తీసుకొచ్చిన నమస్తే పథకం గురించి చర్చించారు.
మహిళా సాధికారతకు ప్రాధాన్యం
భారతీయ సమాజంలో మహిళలను సమానంగా చూస్తున్నప్పటికీ, సంప్రదాయ పక్షపాతాలు కొనసాగుతున్నాయని ద్రౌపదీ తెలిపారు. గత దశాబ్దం నుంచి మహిళా సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులను మూడు రెట్లు పెంచినట్లు తెలిపారు. స్త్రీ కార్మికుల భాగస్వామ్యాన్ని పెంచడానికి, మెరుగైన లింగ నిష్పత్తికి దారితీసిందని పేర్కొన్నారు. మహిళా సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రభుత్వం సమాన ప్రాధాన్యతనిస్తోందన్నారు. మహిళా సాధికారతకు నారీ శక్తి వందన్ అధినియం (మహిళా రిజర్వేషన్ చట్టం) ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పారు.