తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి- జ్యుడీషియల్ ఎంక్వైరీకి అదేశించిన సీఎం యోగీ - MAHA KUMBH STAMPEDE

కుంభమేళా తొక్కిసలాట ఘటనలో 30 మంది మృతి - 60 మందికి తీవ్రగాయాలు

Maha Kumbh Stampede
Maha Kumbh Stampede (PTI)

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2025, 6:48 PM IST

Updated : Jan 29, 2025, 8:35 PM IST

Maha Kumbh Stampede :కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి చెందారని, మరో 60 మంది గాయపడ్డారని మహాకుంభ్​ డీఐజీ వైభవ్​కృష్ణ తెలిపారు. 'మౌని అమావాస్య సందర్భంగా బ్రహ్మ ముహూర్తంలో అమృతస్నానం ఆచరించే ఉద్దేశంతో ప్రజలు భారీగా గుమిగూడారు. రద్దీ కారణంగా బారికేడ్లు విరిగిపోయాయి. దీనితో అర్థరాత్రి 1-2 గంట్ల మధ్య ఈ తొక్కిసలాట జరిగింది. సుమారు 90మంది క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రులకు తరలించగా, దురదృష్టవశాత్తు 30 మంది భక్తులు మరణించారు. మరో 60 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మృతుల్లో 25 మందిని గుర్తించాం' అని మహాకుంభ్​ డీఐజీ పేర్కొన్నారు. అదనపు వివరాల కోసం హెల్ప్​లైన్​ 1920ను సంప్రదించవచ్చని సూచించారు. కాగా తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఇవాళ కుంభమేళాకు వీఐపీలను ఎవరినీ అనుమతించలేదని ఆయన తెలిపారు.

తొక్కిసలాట నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలను కొంతసేపు నిలిపివేశారు. తొక్కిసలాట ఘటనతో వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది గాయపడ్డవారిని అంబులెన్సుల్లో కుంభమేళా పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఆస్పత్రికి తరలించారు. బాధితుల కుటుంబ సభ్యులు కూడా చేరుకోవటం వల్ల ఆసుపత్రి రద్దీగా మారింది. మహా కుంభమేళాలో భక్తులకు అవసరమైన సహాయం అందించేందుకు యూపీ సర్కారు హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేసింది. మృతులు కర్ణాటక, గుజరాత్‌, అసోం సహా పలు రాష్ట్రాలకు చెందినవారని పోలీసులు వెల్లడించారు.

న్యాయ విచారణకు ఆదేశం
మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపించనున్నట్లు ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. ఈ ఘటన ప్రభుత్వ యంత్రాంగానికి ఓ పాఠం లాంటిందన్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై నివేదిక సమర్పించాలని కుంభమేళా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ ఘటన తన హృదయాన్ని ద్రవింపజేసిందంటూ సీఎం యోగి భావోద్వేగానికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

"ఈ ఘటన హృదయ విదారకంగా ఉంది. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ ఘటనపై జ్యుడీషియల్ కమిషన్​ ఏర్పాటు చేశాం. గత రాత్రి నుంచి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. కుంభమేళా అథారిటీ, పోలీస్​, పరిపాలనా యంత్రాంగం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ దళాలు - తాము చేయగలిగేవన్నీ చేస్తున్నాయి."
- యోగీ ఆదిత్యనాథ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి

మోదీ ప్రగాఢ సానుభూతి
మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తీవ్ర విచారం వ్యక్తంచేశారు. గాయపడివారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడి ఎప్పటికప్పుడు సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. మౌనీఅమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు తరలివచ్చినట్లు చెప్పారు. తొక్కిసలాట కారణంగా కొంతసేపు స్నానాలు నిలిపివేసినట్లు చెప్పిన ప్రధాని మోదీ ఆ తర్వాత పుణ్యస్నానాలు తిరిగి ప్రారంభమైనట్లు తెలిపారు.

మౌనీ అమావాస్య సందర్భంగా అమృతస్నానాల కోసం 12 కి.మీ.పరిధిలో యూపీ సర్కారు అనేక ఘాట్లను ఏర్పాటు చేసింది. ఐతే ఎక్కువ మంది భక్తులు సంగం ఘాట్‌కు చేరుకోవటంతోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.

Last Updated : Jan 29, 2025, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details