Prajwal Revanna Sex Scandal Case : కర్ణాటకలో సంచలనం రేపుతోన్న హసన్ సెక్స్ రాకెట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారిగా స్పందించారు. నిజం గెలుస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు. తాను ప్రసుత్తం బెంగళూరులో లేనని అందుకే విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు ఎక్స్‌లో తెలిపారు. తన న్యాయవాది ద్వారా బెంగళూరులోని CID సమాచారమిచ్చానని వెల్లడించారు. త్వరలోనే నిజం గెలుస్తుందని ప్రజ్వల్ రాసుకొచ్చారు.
దర్యాప్తు వేగవంతం
జనతాదళ్ సెక్యులర్ పార్టీ నుంచి ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేసిన క్రమంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగం పుంజుకుంది. దర్యాప్తునకు 18 మంది అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. హొళెనరసీపుర ఠాణాలో ఫిర్యాదు చేసిన 47 ఏళ్ల బాధితురాలు వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేసింది. కేసులో ఏ1గా ఉన్న హెచ్‌డీ రేవణ్ణకు సిట్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో విచారణకు హాజరు కావాలని సూచించింది.
కర్ణాటకలో ఆందోళనలు ఉద్ధృతం
మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై చర్యలు తీసుకోవాలని కర్ణాటకలో ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ప్రజ్వల్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టాలని కాంగ్రెస్, NSUI, తదితర విద్యార్థి సంఘాలు బెంగళూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. కొన్ని చోట్ల విద్యార్థిణులు రేవణ్ణ దిష్టిబొమ్మను చెప్పుతో కొడుతూ నిరసనలు తెలియజేశారు. ప్రజ్వల్ చేతిలో వందలాది మంది మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వీడియోలు నాలుగేళ్ల కిందటివని హెచ్‌డీ రేవణ్ణ బుకాయించుకోవడం సిగ్గు చేటని కాంగ్రెస్ మండిపడింది.
దేశ రాజకీయాల్లోనూ ప్రకంపనలు
హాసన్ సెక్స్ కుంభకోణం దేశ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీతో జేడీఎస్ పొత్తు ఉండటం వల్ల ఇది మరింత తీవ్రమైంది. మోదీ పరివార్‌లో భాగమైన నేరస్థులకు అరెస్ట్‌ల నుంచి రక్షణ లభిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. సందేశ్‌ఖాలీ ఘటన గురించి ప్రసంగాలు చేసే మోదీ, హసన్ ఘటనపై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజ్వల్‌పై ఆరోపణలు ఉన్నాయని ముందే తెలిసి కూడా ఆయన కోసం మోదీ ఎందుకు ప్రచారం చేశారని నిలదీశారు. బ్రిజ్‌భూషణ్, ఉన్నావ్, ఉత్తరాఖండ్ ఇప్పుడు హాసన ఘటన ఇలా ప్రతి విషయంలో ప్రధాని మౌనం వహించడం నేరస్థులకు మరింత ధైర్యాన్ని ఇస్తోందని ఆరోపించారు. హిందూ మహిళల మంగళసూత్రాలపై మాట్లాడే మోదీ ఈ దారుణ ఘటనకు కూడా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రజ్వల్‌కు కేంద్ర ప్రభుత్వం సాయం
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాయంతోనే ప్రజ్వల్ దేశం దాటినట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. ఇందుకు ప్రణాళిక రచించింది మాజీ ప్రధాని దేవెగౌడ అని వ్యాఖ్యానించారు. వీడియోలు బయటకు రాగానే దేశం విడిచి పారిపోయేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజ్వల్‌కు సాయం చేసిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. ప్రజ్వల్‌ను చట్ట ప్రకారం విచారించాలంటే, అతడిని భారత్‌కు రప్పించాలనీ అందుకు ప్రజ్వల్ డిప్లొమాటిక్ పాస్‌పోర్టును వెంటనే రద్దు చేయాలని మోదీకి సిద్ధరామయ్య లేఖ రాశారు. ఈ మేరకు హోంశాఖ, విదేశాంగశాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
"దేవరాజేగౌడ మొదటగా ఎవరిని కలిశారు? నాకు తెలిసి ముందుగా కుమారస్వామికి, ఆ తర్వాత పలువురు బీజేపీ నాయకులకు పెన్‌డ్రైవ్‌లు ఇచ్చారు. ఒకవేళ మాకు అంది ఉంటే మేము వాటిని మరో విధంగా ఉపయోగించేవాళ్లం. కానీ మాకు ఇలాంటి ఎత్తుగడలు రావు. మహిళలను గౌరవిస్తానని చెప్పే కుమారస్వామి, వెంటనే బాధితురాళ్లను కలిసి ఓదార్చాలి."