Prajwal Revanna Return :లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ MP ప్రజ్వల్ రేవణ్ణను కర్ణాటక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అరెస్టు చేసింది. శుక్రవారం తెల్లవారుజామున జర్మనీలోని మ్యూనిచ్ నగరం నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే ప్రజ్వల్‌ను C.I.S.F అదుపులోకి తీసుకుంది. అధికారిక లాంఛనాలు పూర్తైన తర్వాత సిట్ బృందానికి అప్పగించింది. ప్రజ్వల్‌ను విచారణ నిమిత్తం భారీ భద్రత మధ్య బెంగళూరులోని C.I.D కార్యాలయానికి తరలించారు.
ముందస్తు బెయిల్ పిటిషన్ తిరిస్కరణ
లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలతో నెలరోజులుగా పరారీలో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ, కేసు విచారణకు సహకరిస్తానని, శుక్రవారం సిట్ ముందు వ్యక్తిగతంగా హాజరవుతానని సోమవారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని, తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు. ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగమేనని అయితే న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని తెలిపారు. మరోవైపు బెంగళూరు కోర్టులో రేవణ్ణకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఫలితంగా బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగగానే ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేశారు పోలీసులు.