Water Health Benefits Body: మానవ మనుగడకు నీరు జీవనాధారం! మన శరీరంలో సగానికి పైగా నీరే ఉంటుంది. నీటిని పుష్కలంగా తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ, అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్దిష్టంగా శరీరానికి కలిగే ప్రయోజనాలను శాస్త్రీయంగా వెలుగులోకి తెచ్చారు. గతంలో జరిగిన 18 పరిశోధనలను సమీక్షించి అనేక అంశాలను గుర్తించారు పరిశోధకులు. ఈ క్రమంలోనే అధ్యయనం వెల్లడైన అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పరిశోధనలో వెల్లడైన అంశాలు
- ప్రతి రోజు 8 గ్లాసుల నీటిని తాగేవారికి మూత్రపిండంలో రాళ్లు ఏర్పడే అవకాశం తక్కువని Nutrition Reviews జర్నల్లో ప్రచురితమైన Water and Health అధ్యయనంలో తేలింది. ఇంకా శరీర బరువును తగ్గించుకోవడానికీ నీరు సాయపడుతుందని వివరించారు. భోజనానికి ముందు నీరు తాగడం వల్ల ఊబకాయం ముప్పు నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు.
- మనలో చాలా మందికి పదేపదే తలనొప్పి బారిన పడుతుంటారు. అలాంటి వారు మూడు నెలల పాటు నీరు ఎక్కువగా తాగితే ఉపశమనం పొందే వీలుందని చెబుతున్నారు.
- రక్తంలో గ్లూకోజ్ పరిమాణం ఎక్కువగా ఉన్న డయాబెటిక్ బాధితులు 8 వారాల పాటు రోజుకు అదనంగా మరో నాలుగు గ్లాసుల నీరు తాగితే ప్రయోజనం ఉంటుందని వివరించారు.
- తరచుగా మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ల బారినపడే మహిళలు రోజుకు అదనంగా ఆరు గ్లాసుల నీరు తాగితే మంచిదని అంటున్నారు.
- మైగ్రేన్, మధుమేహం, లో బీపీ, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తదితర రుగ్మతలతో బాధపడేవారు నీరు తాగడం వల్ల లబ్ధి కలిగే వీలుందని అంటున్నారు. అయితే, దీనికి సంబంధించి విస్పష్ట శాస్త్రీయ ఆధారాలు లభించలేదన్నారు.
- అయితే, నిత్యం 8 గ్లాసులకు మించి నీరు తాగినా కూడా ఆరోగ్యపరంగా అదనపు ప్రయోజనాలు పెద్దగా ఉండబోవని స్పష్టం చేశారు. ఫలితంగా ఎక్కువగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. ఇలాంటి వారు నీరు తక్కువగా తాగడమే మేలని సూచిస్తున్నారు.
సరిపడా నీరు ఎందుకు అవసరం?
- శరీరంలో ప్రతి కణం ఆరోగ్యంగా ఉంటుంది
- రక్తనాళాల గుండా రక్తం సరిగా ప్రవహిస్తుంది
- జీవక్రియల వల్ల వెలువడే వ్యర్థాలు బయటకు వెళ్తాయి
- చెమట రూపంలో శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది
- ఊపిరితిత్తులు, నోరు వంటి భాగాల్లోని మ్యూకస్ పొరల్లో తేమను ఉంచుతుంది
- కీళ్లలో కందెన సామర్థ్యాన్ని పెంచి కుషన్‌లా పనిచేసేలా చేస్తుంది
- మూత్రాశయ వ్యాధులు, హానీకర బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది.
- జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగి మలబద్ధకాన్ని నివారిస్తుంది
- కణాలకు పోషకాలు, ఆక్సిజన్ అందేలా చేస్తుంది
- చర్మంలో తేమ, రూపురేఖల పరిరక్షిస్తుంది
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పీరియడ్స్ నొప్పులు తగ్గాలా? ఈ టిప్స్ పాటిస్తే నెలసరిలోనూ ఫుల్ యాక్టివ్!
షుగర్ పేషెంట్స్ రోజుకు ఎంత సేపు వాకింగ్ చేయాలి? వారానికి అంత నడిస్తే సూపర్ బెనిఫిట్స్!