తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో నవతరం - తొలిసారిగా పోటీ చేస్తున్న నేతల వారసులు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నేతల వారుసులు పోటీ - తొలిసారి బరిలోకి దిగిన వారే ఎక్కువ

Maharashtra Election 2024
Maharashtra Election 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2024, 7:42 AM IST

Maharashtra Election 2024 :మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నేతల వారసులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహాయుతి నుంచి మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) దాకా అన్ని పార్టీల్లోనూ వారసులు బరిలోకి దిగారు. బీజేపీ, కాంగ్రెస్, ఎన్​సీపీ (ఎస్పీ)ల నుంచి తొమ్మిది మంది చొప్పున బంధుగణం పోటీలో నిలిచారు. శిందే సేన 8 మందిని, ఉద్ధవ్‌ సేన ఐదుగురు వారసులను బరిలో నిలిపాయి.

బీజేపీ
కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ కుమార్తె శ్రీజయ చవాన్‌ భోకర్‌ నుంచి బరిలోకి దిగారు. శ్రీగోండా నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యే బాబన్‌రావ్‌ సతీమణి ప్రతిభ పోటీ చేస్తున్నారు. మలద్‌లో బీజేపీ నగర అధ్యక్షుడు ఆశిష్‌ సోదరుడు వినోద్‌ షెలార్, ఐకాల్‌ కరంజీ నుంచి మాజీ మంత్రి తనయుడు రాహుల్‌ అవధే, సిటింగ్‌ ఎమ్మెల్యే సతీమణి సులభ గైక్వాడ్‌ కల్యాణ్‌ ఈస్ట్‌ నుంచి పోటీలో నిలిచారు.లాతూర్‌ నగర నుంచి కాంగ్రెస్‌ దిగ్గజ నేత శివరాజ్‌ పాటిల్‌ కోడలు అర్చనా పాటిల్‌ బీజేపీ తరఫున తలపడుతున్నారు.

శివసేన (శిందే)
శివసేన అధినేత ఏక్‌నాథ్‌ శిందే పలువురు వారసులకు టికెట్లిచ్చారు. వారిలో చాలా మంది తొలిసారిగా బరిలోకి దిగినవారే ఉన్నారు. పైథాన్‌ నుంచి ఎంపీ సందీపన్‌ భుమ్రే తనయుడు విలాస్, జోగేశ్వరి ఈస్ట్‌ నుంచి ఎంపీ రవీంద్ర వైకర్‌ సతీమణి మనీషా వైకర్, రాజాపుర్‌లో మంత్రి ఉదయ్‌ సోదరుడు కిరణ్‌ సామంత్, కుడాల్‌-సావంత్‌వాడీ నుంచి కేంద్ర మాజీ మంత్రి నారాయణ్‌ రాణె కుమారుడు నీలేశ్‌ రాణె బరిలోకి దిగారు. కన్నాడ్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి రావ్‌సాహెబ్‌ ధన్వే కుమార్తె సంజనా జాదవ్‌ పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్‌
పలు రాజకీయ నేతల వారసులకు ఈసారి కాంగ్రెస్‌ టికెట్లిచ్చింది. అందులో తొలిసారి పోటీ చేస్తున్నవారూ ఉన్నారు. వరోరాలో ఎంపీ ప్రతిభ సోదరుడు ప్రవీణ్‌ కకడే, అర్నిలో మాజీ మంత్రి శివాజీరావ్‌ తనయుడు జితేంద్ర బరిలోకి దిగారు. నైగాన్‌ నుంచి మాజీ ఎంపీ భాస్కర్‌రావ్‌ పాటిల్‌ కోడలు మినాల్‌ పాటిల్, కొల్హాపుర్‌ నార్త్‌లో ఎంపీ సాహు కోడలు మధురిమ రాజె, ధారావిలో వర్ష గైక్వాడ్‌ సోదరి జ్యోతి పోటీ చేస్తున్నారు.

ఎన్​సీపీ (ఎస్పీ)
ఎన్​సీపీ శరద్‌ పవార్‌ పార్టీ నుంచి ఆయన మనవడు వరసయ్యే యుగేంద్ర పవార్‌ బారామతి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన అజిత్‌ పవార్‌ను తలపడతున్నారు. పార్నేర్‌లో ఎంపీ నీలేశ్‌ సతీమణి రాణి, తాస్‌గావ్‌లో మాజీ మంత్రి ఆర్‌ఆర్‌ పాటిల్‌ కుమారుడు రోహిత్‌ పాటిల్, కతోల్‌లో మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తనయుడు సలీల్‌ తలపడుతున్నారు. ఎన్​సీపీ మంత్రి ధర్మారావ్‌ ఆత్రంపై ఆయన కుమార్తె భాగ్యశ్రీ శరద్‌ పవార్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు.

శివసేన (ఉద్ధవ్‌)
బాంద్రా ఈస్ట్‌లో ఉద్ధవ్‌ ఠాక్రే సమీప బంధువు వరుణ్‌ సర్దేశాయ్, కోప్రిలో సీఎం శిందేపై శివసేన దివంగత నేత ఆనంద్‌ బంధువు కేదార్‌ దిఘే పోటీ చేస్తున్నారు.

ఎన్​సీపీ (అజిత్‌)
ఎన్​సీపీ నుంచి మాజీ మంత్రి నవాబ్‌ మాలిక్‌ కుమార్తె సనా అణుశక్తినగర్‌లో తలపడుతున్నారు.

ఎంఎన్‌ఎస్‌
రాజ్‌ ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్‌ఎస్‌ నుంచి ఆయన తనయుడు అమిత్‌ ఠాక్రే మాహిం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details