POCSO Case Against BS Yediyurappa :కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పపై పోక్సో కేసు నమోదు అయింది. ఓ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు బాలిక తల్లి బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నెల రోజుల క్రితం జరిగినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఓ మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను బీజేపీ నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదులో తెలిపారు. గురువారం సాయంత్రం వాళ్లు పోలీసులను ఆశ్రయించగా, అర్ధరాత్రి తర్వాత పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
స్పందించిన యడియూరప్ప
మరోవైపు ఈ ఆరోపణలపై యడియూరప్ప స్పందించారు. "కొన్ని రోజుల క్రితం ఓ మహిళ తనకు సమస్య ఉందంటూ నా ఇంటికి వచ్చింది. దీనిపై ఆరా తీసి, ఆమెకు సాయం చేయాలని పోలీస్ కమిషనర్‌కు చెప్పాను. ఆ తర్వాత ఆమె నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతోంది. ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చాను. గురువారం ఆమె నాపై కేసు పెట్టింది. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. దీని వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ఇప్పుడే చెప్పలేను." అని అన్నారు. ఆయన కార్యాలయం సైతం వీటిని ఖండించింది. ఫిర్యాదుదారు గతంలోనూ పలువురిపై ఇలాంటి ఆరోపణలు చేశారని తెలిపింది. వారు ఇప్పటివరకు 53 ఫిర్యాదులు చేశారంటూ ఆ జాబితాను విడుదల చేసింది.
మాజీ సీఎం యడియూరప్ప తన కుమార్తెపై లైంగిక దాడి చేసినట్లు సదాశివనగర్ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసినట్లు కర్ణాటక హోంశాఖ మంత్రి జి.పరమేశ్వర వెల్లడించారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చేవరకు ఇంతకుమించి వివరాలు చెప్పలేనని కర్ణాటక హోంమంత్రి అన్నారు. ఇందులో మాజీ సీఎం ప్రమేయం ఉన్నందున ఇది చాలా సున్నితమైన కేసు అని పేర్కొన్నారు. ఈ కేసులో రాజకీయ కోణాన్ని కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర తోసిపుచ్చారు.
కర్ణాటకకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు యడియూరప్ప. సీఎం పదవి వీడిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. గతేడాది నవంబరులో ఆ బాధ్యతలను అధిష్ఠానం ఆయన కుమారుడు విజయేంద్రకు అప్పగించింది. ప్రస్తుతం యడియూరప్ప బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా కొనసాగుతున్నారు.