PM Pariksha Pe Charcha 2024 :పరీక్షల సమయంలో విద్యార్థులపై తల్లిదండ్రులు ఒత్తిడి పెంచకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్‌లను వారి విజిటింగ్ కార్డులుగా తల్లిదండ్రులు పరిగణించకూడదని పేర్కొన్నారు. వివిధ పరీక్షలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. దిల్లీలోని భారత్ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు మోదీ. విద్యార్థులు తమతో తామే పోటీ పడాలని, ఎదుటివారితో కాదని స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేలా ఉపాధ్యాయులు చూడాలని పిలుపునిచ్చారు.
"తల్లిదండ్రులు ప్రతిసారి వారి పిల్లలకు తోటి విద్యార్థుల గురించి ఉదాహరణలు ఇస్తుంటారు. ఎప్పుడూ ఇతరుల గురించి చెబుతుంటారు. దయచేసి తల్లిదండ్రులు ఈ విషయాల నుంచి దూరంగా ఉండండి. కొందరు తల్లిదండ్రులు జీవితంలో సఫలీకృతం కానప్పటికీ, వారి విజయాల గురించి ప్రపంచానికి చెప్పడానికి ఏమీ లేనప్పటికీ పిల్లల రిపోర్ట్ కార్డులను విజిటింగ్ కార్డుగా మారుస్తారు. ఎవరినైనా కలిస్తే పిల్లల గురించి చెబుతారు. ఈ తరహా విధానం వల్ల పిల్లల మనస్సులో తామే తల్లిదండ్రులకు అన్నీ అనే భావన ఏర్పడుతుంది.
రోజుకు 15 గంటలు చదవాలని ఒత్తిడి చేయడం మంచిది కాదు. పరీక్షల ఒత్తిడి అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ సొంత పద్ధతులు పాటించాలి. ఎలాంటి ఒత్తిడినైనా మనం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలగాలి. ఏదైనా చల్లని ప్రదేశానికి వెళ్తే అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకుంటాం. అదే విధంగా పరీక్షలకు సన్నద్ధం కావాలి. చదివే సమయాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి. రాత్రి నిద్ర పోకుండా చదవడం వల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది. పిల్లలను వారి స్నేహితులతో పోల్చి ఇబ్బంది పెట్టడం సరికాదు. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని ముందుకెళ్లాలి. "
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
'విద్యార్థులపై మూడు రకాల ఒత్తిడి'
సాధారణంగా విద్యార్థుల్లో మూడు రకాల ఒత్తిడి నెలకొంటుందని ప్రధాని పేర్కొన్నారు. పెద్దల నుంచి, తల్లిదండ్రుల నుంచి వచ్చే ఒత్తిడికి తోడు విద్యార్థులు తమపై స్వయంగా ఒత్తిడి పెంచుకుంటున్నారని తెలిపారు. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే ఒత్తిడి ఉండదని వారికి సూచించారు మోదీ. క్రమంగా ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ వెళ్తే పరీక్షల సమయానికి పూర్తిగా సన్నద్ధం కావొచ్చని పేర్కొన్నారు. విద్యార్థులే దేశ భవిష్యత్‌ను నిర్దేశిస్తారని చెప్పారు. ప్రస్తుతం విద్యార్థులు గతం కంటే ఎక్కువగా సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారని తెలిపారు.