PM Modi Rajya Sabha Speech Today :కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానానికి కాలం చెల్లిందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తన పనిని అవుట్ సోర్సింగ్‌కు ఇచ్చిందన్నారు. ప్రతిపక్ష పార్టీ ఆ స్థాయికి దిగజారడం తమకు సంతోషం కానప్పటికీ, సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాని చెప్పారు. రిజర్వేషన్ల విషయంలోనూ ఆ పార్టీది ప్రతికూల వైఖరేనని విమర్శించారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బుధవారం సమాధానం ఇచ్చిన క్రమంలో కాంగ్రెస్‌పై మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రాష్ట్రాల మధ్య విభజన తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నం!
అధికార దాహంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికిరాత్రే రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ప్రజాస్వామ్యం గొంతును నులిపేసిందన్నారు. ఇప్పుడు ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య విభజన తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని మోదీ ధ్వజమెత్తారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కాంగ్రెస్‌కు తెలుసని, వాటిని పరిష్కరించేందుకు ఏమీ చేయలేదని విమర్శించారు.
"కాంగ్రెస్‌లో వారి నాయకులు, విధానాలకే ఎలాంటి గ్యారంటీ లేదు. అలాంటి వారు మోదీ గ్యారంటీలను ప్రశ్నిస్తున్నారు. దళితులు, గిరిజనులకు కాంగ్రెస్ వ్యతిరేకం. మాజీ ప్రధాని నెహ్రూను వారు గుడ్డిగా అనుసరిస్తున్నారు. రిజర్వేషన్లను ఆయన గట్టిగా వ్యతిరేకించారు. మా హయాంలో ఎస్సీ, ఎస్టీలకు అన్ని పదవుల్లో విశేష ప్రాధాన్యం ఇచ్చాం. తొలిసారి ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. కాంగ్రెస్ పాలకులు వారి కుటుంబీకులకు మాత్రమే అత్యున్నత పురస్కారాలను అందించారు. 1990లో కేంద్రంలో మా మద్దతుతో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను భారతరత్నతో సత్కరించింది. బ్రిటిష్ వారి నుంచి కాంగ్రెస్ స్ఫూర్తి పొందింది. దశాబ్దాలుగా బానిసత్వ చిహ్నాలను కొనసాగించింది."
-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి