PM Modi On TMC : బంగాల్లో ప్రజలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లూటీ చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కేంద్రం పంపిన నిధులను దోచుకోవడానికి టీఎంసీ నకిలీ జాబ్ కార్డులను సృష్టించిందని మోదీ ఆరోపించారు. బంగాల్ పర్యటనలో భాగంగా రూ. 4,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసగింస్తూ టీఎంసీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ప్రజల భూములను దోచుకోవటంలో బిజీ
అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు సిలిగురి- రాధికాపుర్ మధ్య కొత్త ప్యాసింజర్ రైలు సర్వీసును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. బంగాల్లో తొలుత వామపక్షాలు ప్రజల మాట వినలేదని ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కూడా ప్రజలను పట్టించుకోవడం లేదని మోదీ ఆరోపించారు. 'వీరంతా ప్రజల భూములు దోచుకోవటంలో బిజీగా ఉన్నారు. బంగాల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఇక్కడి మంత్రులు జైలులో ఉన్నారు. స్వాతంత్య్రం అనంతరం బంగాల్ అభివృద్ధిని కాంగ్రెస్ విస్మరించింది. తమ ప్రభుత్వం మాత్రం తూర్పు భారతాన్ని అభివృద్ధి ఇంజిన్‌గా పరిగణిస్తోంది' అని మోదీ తెలిపారు.