PM Modi On Congress:కాంగ్రెస్ పార్టీ పరివార్‌వాదం (బంధుప్రీతి), అవినీతి, బుజ్జగింపులకు మించి ఆలోచించదని ఎద్దేవా చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశాభివృద్ధి వారి ఎజెండాలో ఎప్పుడూ లేదని ఆరోపించారు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిందని, కానీ ఆ పార్టీ దృష్టి కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపైనే ఉందని విమర్శించారు. దేశ భవిష్యత్తును నిర్మించడం మరచిపోయిందని తెలిపారు. వికసిత్ భారత్ వికసిత్ ఛత్తీస్‌గఢ్ కార్యక్రమంలో భాగంగా ప్రసంగించిన మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాయ్‌పుర్‌లో రూ.34,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మోదీ. వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించినప్పుడు, అభివృద్ధిలో ఛత్తీస్‌గఢ్ కొత్త శిఖరాలకు చేరుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దశ, దిశ కూడా అప్పటి లానే ఉన్నాయని మోదీ దుయ్యబట్టారు. పరివార్‌వాదం, అవినీతి, బుజ్జగింపులకు అతీతంగా కాంగ్రెస్ ఆలోచించదని అన్నారు. తమ కుమారులు, కుమార్తెల భవిష్యత్తును రూపొందించడంలో మాత్రమే ఆ పార్టీ నేతలు బిజీగా ఉన్నారని ఆరోపించారు.
'మోదీకి ప్రజలే కుటుంబం'
ప్రజల గురించి ఎన్నటికీ కాంగ్రెస్ ఆలోచించలేదని ఆరోపిందారు మోదీ. కానీ మోదీకి ప్రజలే కుటుంబమని, వారి కలలే ముఖ్యమని చెప్పారు. పేదలు, యువత, మహిళల సాధికారతతోనే అభివృద్ధి చెందిన ఛత్తీస్‌గఢ్‌ను నిర్మించవచ్చని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని గత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేసిందని, బీజేపీ ప్రభుత్వం దానిని వేగవంతం చేసిందని తెలిపారు.
'దేశానికి సహకారం రంగం సహాయం చేయాలి'
మరోవైపు, సహకార రంగం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులైన వంటనూనెలు, ఎరువుల దిగుబడుల తగ్గింపు విషయమై సహకార రంగం దేశానికి సహాయం చేయాలని మోదీ కోరారు. దిల్లీలోని దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు- PACSల పరిధిలో 11 గోదాములను ప్రారంభించిన సందర్భంగా మోదీ మాట్లాడారు.
"మన రైతుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వల పథకం/బండారన్ పథకం ప్రారంభించాం. దీని ద్వారా దేశం నలుమూలల వేలాది గిడ్డంగులు, వేలాది గోదాముల నిర్మాణం జరగనుంది. అలాగే 18వేల పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ కూడా పూర్తయింది. ఈ పనులన్నీ దేశంలో వ్యవసాయ మౌలిక సదుపాయాల విస్తరణకు, వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయనున్నాయి."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి