PM Modi On Budget :దేశం ప్రగతి పథంలో కొత్త శిఖరాలను చేరుతోందని, ప్రజల ఆశీర్వాదంతో అందరినీ కలుపుకుని పోయేలా తమ ప్రయాణం కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతామని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.
పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునేవారిని ప్రజల క్షమించరని విపక్షాలకు చురకలంటించారు ప్రధాని మోదీ. 'పార్లమెంట్ కార్యకలాపాలను తరచూ అడ్డుకునే ఎంపీలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, అనైతికంగా వ్యవహరించిన వారు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలి. ఇలా అంతరాయం కలిగించేవారిని ఎవరూ గుర్తుపెట్టుకోరు.' అని ప్రధాని మోదీ తెలిపారు.
శాంతి పరిరక్షణలో మహిళలు కీలకంగా మారుతున్నారని మోదీ పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో నిర్వహించిన తొలి సమావేశాల్లో 'నారీ శక్తి వందన్ అధినియమ్' పేరుతో మహిళా రిజర్వేషన్లకు ఆమోదం తెలిపి చారిత్రక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 'జనవరి 26న కర్తవ్యపథ్‌లో మన నారీశక్తిని ప్రపంచానికి చాటిచెప్పాం. ఈ రోజు(బుధవారం) బడ్జెట్ సమావేశాలు కూడా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మార్గదర్శకత్వంలో మొదలు కానున్నాయి. రేపు(గురువారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మన నారీశక్తికి ఇదే ప్రతీక' అని మోదీ కొనియాడారు.
ప్రస్తుత లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు. ఫిబ్రవరి 9వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. గత ఘటనల దృష్ట్యా పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఐఎస్‌ఎఫ్ బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి.
ఏప్రిల్-మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఫిబ్రవరి ఒకటిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ముకశ్మీర్ వార్షిక పద్దును కూడా సభ ముందుకు తీసుకురానున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికారం చేపట్టే ప్రభుత్వం జులైలో మళ్లీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.