Parliament Winter Session 2024 PM Modi :కొందరు వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంట్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని, గందరగోళాలకు పాల్పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. 80-90సార్లు ప్రజలు తిరస్కరించిన వారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం గూండాయిజాన్ని ఆశ్రయిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారి వ్యూహాలు చివరకు విఫలమైనప్పటికీ, ప్రజలు వారి ప్రవర్తనను నిశితంగా గమనిస్తారని తెలిపారు.
ఈ మేరకు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ వద్ద ప్రధాని, ప్రతిపక్షాలపై పరోక్షంగా మండిపడ్డారు. నిరంతరం ప్రజలు తిరస్కరించే వారు తమ సహచరుల మాటలను విస్మరిస్తారని, ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడూ అగౌరవపరుస్తారని విమర్శించారు. పార్లమెంట్‌లో ఫలప్రదమైన చర్చలు జరగాలని అధికార, విపక్ష సభ్యులను మోదీ కోరారు.
సంవిధాన్ సదన్‌లో రాజ్యాంగ దినోత్సవం!
"ప్రస్తుతం మనం 2024ను పూర్తి చేసుకోబోతున్నాం. 2025 కోసం దేశం సిద్ధమవుతోంది. ఈ పార్లమెంట్ సమావేశాలు ఎన్నో అంశాలపరంగా ముఖ్యమైనవి. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ నవంబరు 26 నాటికి 75వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. దానికి గుర్తుగా రేపు సంవిధాన్ సదన్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుందాం" అని మోదీ మీడియాకు తెలిపారు.
"ప్రపంచం ఇప్పుడు మనల్ని ఎంతో ఆశావహ దృక్పథంతో చూస్తోంది. ఆ గౌరవం పెంపొందేలా సభలో మన ప్రవర్తన ఉండాలి. పార్లమెంట్ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉంది. దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. వివిధ అంశాలను సరైన రీతిలో సభలో ఎత్తిచూపడం ద్వారా మనం వారి ఆకాంక్షలను నెరవేర్చగలం. దాని నుంచి రాబోయే తరాలు ప్రేరణ పొందుతాయి. ఈ సెషన్ ఫలవంతంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ సమావేశాలను ఉత్సాహంగా ముందుకుతీసుకెళ్లాలని ఎంపీలందరినీ కోరుతున్నాను" అని మోదీ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి.
అంతకుముందు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం వల్లే దేశంలో సామాజిక, ఆర్థిక మార్పులు తీసుకురాగలిగామని అణగారిన వర్గాలకు సమున్నత స్థానం కల్పించామని అన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా అన్నివర్గాల ప్రజలు సమాన ఓటు హక్కు వినియోగించుకోవడానికి కారణం అదేనని కొనియాడారు.