Jharkhand Election 2024 Santhal Pargana :ఝార్ఖండ్‌లో తొలి విడత పోలింగ్ పూర్తి కావడం వల్ల రెండో విడతపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నెల 20వ తేదీన రాష్ట్రంలోని మిగిలిన 38 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో గిరిజన ప్రాంతాలు అధికంగా ఉండటం వల్ల ఝార్ఖండ్ ముక్తి మోర్చాకు (జేఎంఎం) అత్యంత కీలకం కానుంది. ఇక్కడి ఫలితాలే వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఎవరు పాలించేదీ తేల్చనున్నాయి. ఈ ప్రాంతంలోని మొత్తం 38 సీట్లలో 18 సీట్లలో ఫలితాలను సంతాల్ గిరిజనులే తేలుస్తారు. జేఎంఎంకు ఈ ప్రాంతం కంచుకోట కావడమే కాకుండా ఈసారి రక్త సంబంధీకుల మధ్య పోటీ నెలకొనడం ఆసక్తికరంగా మారింది.
కుటుంబాల పోటీ
ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బర్హైట్ నుంచి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన మరో నియోజకవర్గం దుంకా నుంచి ఈసారీ ఆయన సోదరుడు బసంత్ సోరెన్ పోటీ చేస్తున్నారు. హేమంత్ గతంలో దుంకాను వదులుకోవడం వల్ల బసంత్ ఉప ఎన్నికల్లో గెలిచారు.జమాలో హేమంత్ వదిన సీతా సోరెన్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆమె ఇటీవలే జేఎంఎం నుంచి బీజేపీలోకి మారారు. గాండేయ్‌లో హేమంత్ సతీమణి కల్పనా సోరెన్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ గిరిజనులు, ముస్లింలు కలిపి 40శాతందాకా ఉన్నారు. ఇదే కల్పన బలం.