Patanjali Foods Recalls :భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ఆదేశాల మేరకు పతంజలి ఫుడ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాచ్ నంబర్ ఏజేడీ2400012 కలిగిన 4 టన్నుల కారం పొడి ప్యాకెట్లను(200 గ్రాములవి) మార్కెట్ నుంచి వెనక్కు రప్పిస్తోంది. ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నందు వల్లే ఆ కారం పొడిని వెనక్కి తీసుకోవాలని పతంజలి ఫుడ్స్‌కు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్దేశించింది. ఈమేరకు వివరాలతో పతంజలి ఫుడ్స్ సీఈఓ సంజీవ్ ఆస్థానా ఓ ప్రకటన విడుదల చేశారు. "మేం మార్కెట్ నుంచి 4 టన్నుల కారం పొడిని వెనక్కు తీసుకుంటున్నాం. అవి 200 గ్రాముల కారం పొడి ప్యాకెట్లు" అని ఆయన తెలిపారు. "ఆ ప్యాకెట్లలోని కారం పొడిని ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు తనిఖీ చేయగా క్రిమిసంహారకాలు మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది" అని పతంజలి ఫుడ్స్ సీఈఓ చెప్పారు.
వినియోగదారులకు పూర్తి రీఫండ్
"ఎఫ్ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఆదేశాలు అందగానే మేం మా డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించాం. ఆ మిర్చి పౌడర్ స్టాక్‌ను మార్కెట్ నుంచి వెనక్కు తెప్పించుకుంటున్నాం. ఆ బ్యాచ్‌కు చెందిన కారంపొడిని కొన్న వినియోగదారులు, వెనక్కి ఇచ్చి డబ్బులు తీసుకోవాలని పేర్కొంటూ ప్రకటనలు ఇచ్చాం" అని సంజీవ్ ఆస్థానా వెల్లడించారు. కారం ప్యాకెట్లు కొన్నచోటే కస్టమర్లు వాటిని తిరిగి ఇచ్చి, పూర్తి డబ్బులు వాపసు తీసుకోవాలని సూచించారు.