Opposition On Hindenburg Allegations : అదానీ గ్రూప్ చేస్తున్న కుంభ కోణాలపై, సెబీ ఛైర్మన్ మాధబి పురి బచ్ క్రోనీ క్యాపిటలిజంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలో చేసిన సంచలన ఆరోపణలపై వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని, కానీ మోదీ సర్కార్ ఈ విషయంలో చాలా ఉదాసీనంగా ఉందని దుయ్యబట్టాయి.
అమెరికా షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్‌లలో సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది. అదానీ గ్రూప్ అనేక అవకతవకలకు పాల్పడుతోందని కూడా పేర్కొంది. దీనితో విపక్షాలు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నాయి.
తక్షణమే చర్యలు తీసుకోవాలి - కాంగ్రెస్
అదానీ గ్రూప్‌పై కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 'అదానీ గ్రూప్ చేస్తున్న కుంభకోణాలపై దర్యాప్తు విషయంలో సెబీ ఆసక్తి కనబరచకపోవడానికి గల కారణం ఇప్పుడు అర్థమైంది. దీనిని సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ కూడా గుర్తించలేకపోయింది' అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. 2023లో అదానీ గ్రూప్ చేస్తున్న అవకతవకలపై హిండెన్‌బర్గ్ నివేదిక వెలువరించినప్పుడు 13 అనుమానాస్పద లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నామని సెబీ నిపుణుల కమిటీకి తెలిపిందన్నారు. కానీ ఇప్పటికీ వారు చేస్తున్న దర్యాప్తు పూర్తి కాలేదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముందు పార్లమెంటు సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయని చెప్పిన మోదీ సర్కార్, ఆగస్టు 9న మధ్యాహ్నం అకస్మాత్తుగా వాయిదా వేయడానికి కారణం ఏమై ఉండొచ్చో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోందని జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు.