Internet Users In India : ఇది ఇంటర్నెట్ యుగం. ప్రతీ రంగంలో డిజిటల్ సేవలు అందించే వేదికలు సందడి చేస్తున్నాయి. అయినప్పటికీ నేటికీ మన దేశంలో నెటిజన్లు ఆన్‌లైన్ లెర్నింగ్‌కు మొగ్గుచూపడం లేదట. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI), మార్కెట్ పరిశోధనా కంపెనీ కాంతార్ (Kantar) నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించారు. భారత్‌లోని నెటిజన్లలో కేవలం 3 శాతం మందే ఆన్‌లైన్ లెర్నింగ్‌ను వినియోగించుకుంటున్నట్లు ఈ అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. ఇదే సమయంలో ఓటీటీల్లో వీడియోలు చూడటం, మ్యూజిక్‌ను వినడం, ఆన్‌లైన్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా వినియోగం వంటి విషయాల్లో భారతీయ నెటిజన్లు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నట్లు తేలింది.
ఆన్‌లైన్ కమ్యూనికేషన్
సోషల్ మీడియాను వినియోగించడం, చాట్ చేయడం, ఈమెయిల్స్ పంపడం, కాల్స్ చేయడం వంటివన్నీ ఆన్‌లైన్ కమ్యూనికేషన్ విభాగంలోకే వస్తాయి. దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు వీటి వినియోగంపై అమితాసక్తిని చూపుతున్నారని నివేదికలో పేర్కొన్నారు.
ఆన్‌లైన్ లెర్నింగ్ కార్యకలాపాలు
ఆన్‌లైన్ పోర్టల్స్, యాప్స్ ద్వారా విద్యా సంబంధిత వనరులను సమకూర్చుకోవడం, విద్యాసంస్థకు వర్చువల్‌గా హాజరుకావడం, నైపుణ్యాల పెంపు కోర్సులను నేర్చుకోవడం వంటివన్నీ ఆన్‌లైన్ లెర్నింగ్ కార్యకలాపాల పరిధిలోకి వస్తాయి. దేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరిగినప్పటికీ ఆన్‌లైన్ లెర్నింగ్‌పై నెటిజన్ల ఆసక్తి అంతగా పెరగలేదని అధ్యయనంలో గుర్తించారు.
కమ్యూనికేషన్‌కు రెక్కలు
ఈ ఇంటర్నెట్ విప్లవం ఫలితంగా దాదాపు 75 శాతం మంది భారతీయ నెటిజన్లు తమ కమ్యూనికేషన్‌ను బాగా మెరుగుపర్చుకున్నారు. ఛాటింగ్, ఈమెయిలింగ్, కాల్స్ చేయడం వంటివన్నీ చేస్తున్నారు. మన దేశ నెటిజన్లలో దాదాపు 74 శాతం మంది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికలను చురుగ్గా వినియోగిస్తున్నారు.
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల జోరు
54 శాతం మంది నెటిజన్లు ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవడ్డారు. ఇక ఓటీటీ కంటెంట్ (ఆడియో, వీడియో)ను సైతం బాగా సబ్‌స్క్రయిబ్ చేసుకుంటున్నారు. యూట్యూబ్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, గానా వంటి వేదికల్లో ఇబ్బడిముబ్బడిగా సబ్‌స్క్రిప్షన్లు తీసుకుంటున్నారు.
ఇంటర్నెట్ వినియోగంలో దూసుకుపోతున్న గ్రామీణ ప్రాంతాలు
ఈ ఏడాది (2025) చివరికల్లా భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 90 కోట్లకు చేరుతుందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI), కాంతార్(Kantar) సంయుక్త అధ్యయన నివేదిక అంచనా వేసింది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగదారులు బాగా పెరుగుతారని తెలిపింది. ప్రస్తుతం మన దేశంలోని మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో 55 శాతం మంది గ్రామీణ ప్రాంతాలవారేనని పేర్కొంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం రెట్టింపు వేగంతో పెరుగుతోందని నివేదికలో ప్రస్తావించారు. దీన్నిబట్టి దేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎంతగా పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ వినియోగం లెక్కలివీ!
- ప్రస్తుతం మన దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారుల్లో 53 శాతం మంది పురుషులు, 47 శాతం మంది మహిళలు. ఈ లెక్కన ఇంటర్నెట్ వినియోగంలో పురుషులు, మహిళల మధ్య పెద్ద గ్యాప్ లేదని నివేదిక తెలిపింది.
- ఇంటర్నెట్ వినియోగంలో దేశంలోనే నంబర్ 1 స్థానంలో కేరళ రాష్ట్రం ఉంది. కేరళ జనాభాలో 72 శాతం మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. తర్వాతి స్థానాల్లో గోవా (71 శాతం), మహారాష్ట్ర (70 శాతం) ఉన్నాయి.
- అతితక్కువ ఇంటర్నెట్ కనెక్టివిటీతో బిహార్ (43 శాతం), ఉత్తర్‌ప్రదేశ్ (46 శాతం), ఝార్ఖండ్ (50 శాతం) రాష్ట్రాలు ఉన్నాయి.
- భారతీయ ఇంటర్నెట్ వినియోగదారులు ప్రతిరోజు సగటున 90 నిమిషాల పాటు ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు. గ్రామీణ ప్రాంత నెటిజన్లతో పోలిస్తే పట్టణ ప్రాంత నెటిజన్లు రోజూ ఎక్కువ సమయాన్ని ఆన్‌లైన్‌కు కేటాయిస్తున్నారు.