Maharashtra Assembly Polls Mahim:మరికొద్దిరోజుల్లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగనుండడం వల్ల ప్రస్తుతం అందరీ దృష్టి మహిమ్ అసెంబ్లీ సీటుపై ఉంది. ఎందుకంటే ఆ నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే తొలిసారి బరిలోకి దిగారు. అలాగే శివసేన(యూబీటీ), శివసేన(శిందే వర్గం) అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సెంట్రల్ ముంబయిలో ఉన్న ఈ ప్రతిష్ఠాత్మకమైన నియోజకవర్గాన్ని గెలుచుకోవడానికి మూడు పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
అవిభాజ్య శివసేనలోని 3పార్టీల మధ్యే పోటీ!
అవిభక్త శివసేన 1966లో ఏర్పడగా, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన 2006లో ఏర్పడింది. శివసేన నుంచి విడిపోయి రాజ్ ఠాక్రే ఎమ్ఎన్ఎస్ను స్థాపించారు. ముంబయిలోని 36 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటైన మహిమ్ నుంచి ఎమ్ఎన్ఎన్ తరఫున రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే బరిలోకి దిగారు. శివసేన నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సదా సర్వాంకర్, ఉద్ధవ్ వర్గం నుంచి మహేశ్ సావంత్ పోటీలో ఉన్నారు.
మైనార్టీల ఓట్లు స్వల్పమే!
కాగా, మహిమ్లో అగ్రవర్ణ ఓటర్లు ఎక్కువ ఉండే నియోజకవర్గం, అలాగే కాస్మోపాలిటన్ నగరం. మైనారిటీల ఓట్లు స్వల్పంగానే ఉన్నాయి. శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ ప్రధాన కార్యాలయాలు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయ. ఇక్కడే రెండు పార్టీలు దసరా ర్యాలీలు, పార్టీ వార్షికోత్సవాలను జరుపుకుంటాయి. 1990 నుంచి మహిమ్ నియోజవర్గం అవిభక్త శివసేన, ఎమ్ఎన్ఎస్కు కంచుకోటగా ఉంది. 2009లో ఎంఎన్ఎన్ అభ్యర్థి నితిన్ సర్దేశాయ్ మహిమ్ నుంచి గెలుపొందారు కూడా.
శివసేనలో చీలిక
కాగా, 2022 జూన్ లో శివసేనలో చీలిక ఏర్పడింది. ఏక్నాథ్ శిందే నేతృత్వంలో ఎమ్మెల్యేలు ఉద్ధవ్‌పై తిరుగుబాటు చేసి పార్టీలో చీలిక తెచ్చారు. ఈ క్రమంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ కూడా ప్రభుత్వంలో భాగమైంది.
రెండు కూటములు మధ్యే ప్రధాన పోటీ
288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. నవంబరు 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. బీజేపీ, శివసేన, ఎన్సీపీ కలిసి మహాయుతిగా బరిలోకి దిగుతున్నాయి. శివసేన(యూబీటీ), ఎన్సీపీ(శరద్ పవార్), కాంగ్రెస్ కలిసి మహా వికాస్ అఘాడీగా పోటీ చేస్తున్నాయి. ఈ రెండు కూటములు మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా జరగనుంది.