Jammu Kashmir Omar Abdullah : నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీనగర్‌లో జరిగిన సమావేశంలో ఒమర్ అబ్దుల్లాను ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలందరూ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రధాన కార్యాలయం నవా-ఈ-సుబాలో సమావేశమై తమ నాయకుడిని గురువారం ఎన్నుకున్నారు.
ఎన్‌సీ శాసనసభాపక్ష నేతగా ఒమర్ అబ్దుల్లా- సీఎంగా ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే? - JAMMU KASHMIR OMAR ABDULLAH
ఎన్‌సీ శాసనసభాపక్షనేతగా ఒమర్ అబ్దుల్లా- శుక్రవారం మరో సమావేశం
Published : Oct 10, 2024, 3:10 PM IST
|Updated : Oct 10, 2024, 3:37 PM IST
జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ భాగస్వామ్యపక్షాలతో శుక్రవారం మరో సమావేశం జరగనుందని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. అయితే తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు ఒమర్ అబ్దుల్లా. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు ప్రకటించారని చెప్పారు. కాంగ్రెస్ నుంచి లేఖ వచ్చాక, రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలుస్తామని తెలిపారు. మరోవైపు, ఆదివారం లేదా సోమవారం ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
కాగా, పదేళ్ల తర్వాత జమ్ముకశ్మీర్‌లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కన్నా రెండు సీట్లు ఎక్కువగానే గెలుచుకుంది. ఎన్‌సీ 42 చోట్ల, కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయ దుందుభి మోగించాయి. బీజేపీ 29 సీట్లను సొంతం చేసుకుంది. పీడీపీ మూడు స్థానాలకు పరిమితమైంది. 10 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. అందులో ఒకరు ఆప్ అభ్యర్థి ఉన్నారు.