Old Man Secured PHD At 89 Years : 89 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ పూర్తి చేసి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు కర్ణాటకకు చెందిన మార్కండేయ దొడ్డమణి అనే వృద్ధుడు. కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొంది రాష్ట్రంలోనే తొలి సీనియర్ పీహెచ్‌డీ గ్రాడ్యుయేట్‌గా ఘనత సాధించారు.
ధార్వాడ్‌లోని జయనగర్‌లో నివాసముంటున్న మార్కండేయ దొడ్డమణి ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందిన తర్వాత సాహిత్య రంగంలో చాలాకాలం పాటు పనిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 18 ఏళ్ల పాటు శివశరణ్ డోహర కక్కయ్య అనే వ్యక్తి రచించిన వచనాలు, ఆయన జీవిత చరిత్రపై పూర్తి అధ్యయనం చేశారు. అలా మార్కండేయకు కక్కయ్యకు సంబంధించిన వచన సాహిత్యంపై పీహెచ్‌డీ చేయాలనే ఆలోచన వచ్చింది.
"నాకు ఎప్పటినుంచో ఏదైనా సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ చేసి అందులో పట్టా పొందాలని ఉండేది. ఈ క్రమంలో ఏ సబ్జెక్ట్‌లో చేస్తే బాగుంటుందని ఆలోచించడం మొదలుపెట్టా. అప్పుడు నా మెదడులో శివశరణ హరలయ్యతో సమానంగా పనిలో నిమగ్నమైన శివశరణ్ డోహర కక్కయ్య పేరు తట్టింది. ఇక ఈయన పేరు మీదే ప్రొఫెసర్ ఆర్.ఎస్. తల్వార్ గారి మార్గనిర్దేశంతో అధ్యయనం చేయడం ప్రారంభించా. కానీ తల్వార్ గారి మరణంతో నా రీసెర్చ్‌కు బ్రేక్ పడింది. ఈ సమయంలో కర్ణాటక విశ్వవిద్యాలయంలోని కన్నడ విభాగాధిపతి ప్రొఫెసర్ నిజలింగ మట్టిహల నా అధ్యయనానికి సహకరించారు. నేను రాసిన పుస్తకాలన్నిటినీ ఆయన చూసి మెచ్చుకున్నారు. నిజలింగ మట్టిహల గారి సలహా మేరకు మరో ప్రొఫెసర్ నింగప్ప ముదేనుర్ ఆధ్వర్యంలో ఎట్టకేలకు నా పీహెచ్‌డీని పూర్తి చేయగలిగాను."
- మార్కండేయ దొడ్డమణి, 89 ఏళ్ల సీనియర్ పీహెచ్‌డీ గ్రాడ్యూయేట్