Odisha New CM : ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ఉత్కంఠకు తెర పడింది. మోహన్ చరణ్ మాఝీని సీఎంగా ప్రకటించింది బీజేపీ అధిష్ఠానం. ఈమేరకు మంగళవారం భువనేశ్వర్‌లో జరిగిన సమావేశంలో బీజేపీ శాసన సభా పక్ష నేతగా మోహన్ చరణ్ మాఝీని ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. ఈ భేటీకి బీజేపీ అధిష్ఠానం తరఫున పర్యవేక్షకులుగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రవతి పరీదా ఉపముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపారు.
ఎవరీ మోహన్ చరణ్ మాఝీ?
రాష్ట్రంలో కమలదళ సీనియర్ నేతల్లో ఒకరైన మాఝీ ఇప్పటివరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఈయన, గతంలో చీఫ్ విప్‌గా పనిచేశారు. ఈ సారి ఎన్నికల్లో కియోంజర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేడీ అభ్యర్థి మీనా మాఝీపై 11,577 ఓట్ల తేడాతో గెలిచారు.
ప్రమాణ స్వీకారానికి మోదీ హాజరు
మరోవైపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం బుధవారం సాయంత్రం 5గంటలకు జనతా మైదానంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఆయనతోపాటు మరి కొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. పూరి జగన్నాధుడికి, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ఆహ్వాన లేఖలు అందజేసినట్లు బీజేపీ తెలిపింది. ఈ వేడుకకు సుమారు లక్ష మంది పాల్గొంటారన్న అంచనా వేస్తున్నారు. అయితే తొలుత జూన్ 10న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భావించినప్పటికీ దానిని 12కు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీ షెడ్యూల్ కారణంగా తాజా మార్పు జరిగిందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
రెండున్నర దశాబ్దాల బీజేడీ పాలనకు తెర
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించింది. రెండున్నర దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని పాలించిన బిజూ జనతాదళ్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 చోట్ల గెలిచింది. బిజు జనతా దళ్ 51, కాంగ్రెస్ 14, ఇతరులు 4 చోట్ల గెలుపొందారు. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును చెప్పకుండానే ఎన్నికల్లో ముమ్మర ప్రచారం చేసిన కాషాయ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను కైవసం చేసుకుంది. లోక్‌సభ స్థానాల్లో కూడా బీజేపీ అదరగొట్టింది. మొత్తం 21 లోక్‌సభ స్థానాలకుగాను 20చోట్ల కమలం పార్టీ విజయం సాధించగా కాంగ్రెస్ ఓ స్థానంలో గెలుపొందింది. బిజూ జనతాదళ్ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది.