No Ticket Hate Speech leaders In BJP : బీజేపీ శనివారం విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల తొలిజాబితాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన పలువురు నేతల పేర్లు లేకపోవడం చర్చనీయాంశమైంది. బీజేపీ ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న ప్రగ్యా ఠాకూర్, సిట్టింగ్ ఎంపీలైన పర్వేశ్ వర్మ, రమేశ్ బిధూరితో పాటు జయంత్ సిన్హా పేర్లు లేకపోవడం చర్చలకు తావిస్తోంది. ఈ నేతలు పార్లమెంటు లోపలా, వెలుపలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
ఫైర్‌బ్రాండ్‌కు నో!
మాలేగావ్ పేలుళ్ల కేసులో జైలులో ఉన్న ప్రగ్యా, ఆరోగ్య సమస్యల కారణంతో బయటకు వచ్చి పలు డ్యాన్స్ కార్యక్రమాల్లో పాల్గొనడం విమర్శలకు తావిచ్చింది. గాడ్సేను దేశ భక్తుడని గతంలో ఆమె అభివర్ణించడం వివాదాస్పదమైంది. ఆ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజానికి మంచిది కాదని, ప్రగ్యా, క్షమాపణలు అడిగినా పూర్తిగా క్షమించలేకపోతున్నానని ప్రధాని అన్నారు.
సారీ చెప్పినా- టికెట్ చేజారే
ఒక వర్గాన్ని బహిష్కరించాలని పిలుపునివ్వడం, దిల్లీ షహీన్ భాగ్‌లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలను ఒక గంటలో క్లియర్ చేస్తానని చెప్పడం ఎంపీ పర్వేశ్ వర్మపై వేటుకు కారణమైంది. మరో ఎంపీ రమేశ్ బిధూరి పార్లమెంటులో బీఎస్పీ లోక్‌సభ సభ్యుడైన డానిష్ అలీని కించపరచేలా వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. చివరకు రమేశ్ బిధూరి క్షమాపణలు చెప్పవలసి వచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో బీజేపీ వీరిని హెచ్చరించింది.