Nitin Gadkari On Fuel Vehicles: దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాలను నిర్మూలిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అలాగే భారతదేశాన్ని హరిత ఆర్థికవ్యవస్థగా మార్చాలనే ఆశయంలో భాగంగా హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. "భారత దేశం ఏటా ఇంధ దిగుమతులపై రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ పెట్రోలో, డీజిల్ వాహనాలు నిషేధిస్తే ఈ డబ్బును రైతులు, గ్రామాలు, యువతకు ఉపాధి వాటికి ఉపయోగించవచ్చు" అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాలను పూర్తిగా లేకుండా చేయడం సాధ్యమవుతుందా అని ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు.' 100 శాతం సాధ్యమవుతుంది. అది కష్టమైన విషయమే కానీ అసాధ్యమైనది అయితే కాదు. భారతదేశాన్ని హరిత ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం. ఈ ఆశయ సాధన కోసం హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని ప్రభుత్వం తగ్గించాలి' అని చెప్పారు. హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని 5 శాతం, ఫ్లెక్స్ ఇంజన్లపై 12 శాతం మేర తగ్గించే ప్రతిపాదనను ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు పంపామని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం అవి పరిశీలన దశలో ఉన్నాయని ఆయన వెల్లడించారు.
దిగుమతిని తగ్గించుకోవచ్చు
'ఇంధన దిగుమతులపై మన దేశం ఏటా రూ.16 లక్షల కోట్లు వెచ్చిస్తోంది. ఈ డబ్బు ఆదా అయితే రైతుల జీవితాల మెరుగుదలకు ఉపయోగించవచ్చు. తద్వారా గ్రామాలు సుభిక్షంగా ఉండేలా ప్రణాళికలు తయారు చేయవచ్చు. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు లభించవచ్చు. జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా విదేశాల నుంచి మన దేశం దిగుమతిని నిలువరించగలదు. వాతావరణ సంక్షోభం తలెత్తకుండా చూసేందుకు విద్యుత్ ఉత్పత్తిలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అందుబాటులోకి వస్తాయి' అని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు.