NIA Raids Today : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దేశ వ్యాప్తంగా 17 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టింది. లష్కరే తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాది బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లోని ఖైదీలకు ఉగ్రవాద భావజాలం బోధిస్తున్నట్టు నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. అనుమానితులకు సంబంధించిన ప్రదేశాలున్న తమిళనాడు, కర్ణాటక సహా మరో ఏడు రాష్ట్రాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.
2023 జులైలో ఓ ఇంట్లో సమావేశమైన ఐదుగురు వ్యక్తులను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరందరూ లష్కరే తోయిబా ఉగ్రవాది నజీర్ భావజాలంతో ప్రభావితమైనవారిగా గుర్తించారు. అప్పట్లో నిందితుల నుంచి మందుగుండు, ఆయుధాలు, గ్రనేడ్లు, వాకీటాకీలు స్వాధీనం చేసుకొన్నారు. దీంతో కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు. నజీర్ ప్రస్తుతం జీవితఖైదు అనుభవిస్తున్నాడు. గతేడాది కూడా జాతీయ దర్యాప్తు సంస్థ తనిఖీలు నిర్వహించింది.
కొద్ది రోజుల క్రితం బెంగళూరు రామేశ్వరం కెఫేలో పేలుడు ఘటన జరిగింది. ఆ కేసును కూడా సోమవారం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. ఆ తర్వాతి రోజే 2023 నాటి ఉగ్ర కుట్ర కేసుకు సంబంధించిన తనిఖీలు జరగడం గమనార్హం.