New Varieties Of Onion Seeds : ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లోని చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 93 రకాల కొత్త ఉల్లి వంగడాలను అభివృద్ధి చేశారు. వీటితో దేశంలో ప్రతి సంవత్సరం ఏర్పడే ఉల్లిపాయల కొరతను అధిగమించవచ్చని చెబుతున్నారు. వీటిలో ఎరుపుతో పాటు తెలుపు రంగు ఉల్లిపాయలకు చెందిన వివిధ రకాల జాతి విత్తనాలు కూడా ఉన్నాయి. ఈ విత్తనాలను దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అందించనున్నామని, తద్వారా రైతులు రెండు సీజన్ల(రబీ, ఖరీఫ్)లోనూ ఉల్లి సాగుచేసే వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిరంతర సాగుతో దేశంలో ఉల్లి కొరత అనే సమస్యను కొంతైనా అధిగమించవచ్చని అంటున్నారు.
వాస్తవానికి ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉల్లిసాగు చాలా తక్కువగా జరుగుతుందని, దానిని దృష్టిలో ఉంచుకొనే కొత్త ఉల్లి రకాలను ఉత్పత్తి చేశామని చెప్పారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ బతుక్ సింగ్. 'మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఖరీఫ్ సీజన్లో అధికంగా ఉల్లిని సాగు చేస్తారు. కానీ యూపీలో మాత్రం ఆశించిన స్థాయిలో పండించడం లేదు. ఈ కారణంగానే ప్రతి సంవత్సరం అక్టోబర్-నవంబర్ సమయంలో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. అయితే యూపీ ఎక్కువగా మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటుంది' అని రామ్ బతుక్ చెప్పారు.
ఈ 93 రకాల ఉల్లి విత్తనాలను అభివృద్ధి చేసేందుకు రబీ సీజన్ అయిన ఫిబ్రవరి-మార్చిలో శాస్త్రవేత్తలు విత్తనాలను నాటారు. కేవలం 25 రోజుల్లోనే దీనికి సంబంధించిన నర్సరీ సిద్ధం అయింది. దీని ప్రకారం అక్టోబర్-నవంబర్, ఫిబ్రవరి-మార్చి రెండు సీజన్లలోనూ రైతులు ఉల్లిపాయలను పండించే అవకాశం ఉంటుంది. కాగా, కొత్తగా తయారు చేసిన విత్తనాల రకాలు ప్రతి సీజన్‌కు అనుకూలంగా ఉంటాయి. అంతేగాక తెగుళ్లు, వ్యాధులకు దూరంగా ఉంటాయి. ఇదిలాఉంటే భారత్‌లో ప్రతి సంవత్సరం 26,738 మెట్రిక్ టన్నుల ఉల్లి ఉత్పత్తి జరుగుతుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో నెలకు 2.1 లక్షల టన్నులు ఉల్లిని వినియోగిస్తున్నారు. ఈ లెక్కన తలసరి ఉల్లి వినియోగం 20 కిలోలు(సంవత్సరానికి)గా ఉంది.