New Criminal Laws Roll Out :నూతన నేరచట్టాలు భారతీయ న్యాయసంహిత (BNS), భారతీయ నాగరిక సురక్ష సంహిత (BNSS), భారతీయ సాక్ష్య అధినియం(BS), ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్రం హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బీఎన్ఎస్లోని 'హిట్ అండ్ రన్' నేరానికి సంబంధించిన నిబంధనలను వెంటనే అమలు చేయడం లేదని హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాతే, బీఎన్ఎస్లోని సెక్షన్ 106(2) అమలుపై నిర్ణయం తీసుకుంటామని అజయ్ భల్లా వెల్లడించారు. గతంలో హిట్ అండ్ రన్ నిబంధనలపై ట్రక్కు డ్రైవర్లు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది.
ప్రస్తుతం అమలవుతున్న భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి(సీఆర్‌పీసీ), సాక్ష్యాధారాల చట్టం(ఎవిడెన్స్ యాక్ట్) స్థానంలో తీసుకొచ్చిన మూడు నూతన నేర చట్టాలకు గతేడాది డిసెంబరు 21న పార్లమెంటు ఆమోదం తెలిపింది. డిసెంబరు 25న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము వాటికి ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న బ్రిటీష్ కాలం నాటి భారతీయ శిక్షాస్మృతి, నేర శిక్షాస్మృతి, సాక్ష్యాధారాల చట్టాలు ఇక కనుమరుగు కానున్నాయి.
దేశంలోని న్యాయ వ్యవస్థను ఈ మూడు చట్టాలు పూర్తిగా మార్చేయనున్నాయి. ప్రతి నేరానికి సంబంధించిన నిర్వచనం, వాటికి విధించే శిక్షల గురించి వివరంగా ఇందులో ప్రస్తావించారు. తొలిసారి ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. రాజద్రోహం నేరాన్ని 'దేశద్రోహం'గా మార్చారు. దోషులకు శిక్షలు విధించే విషయంలో మేజిస్ట్రేట్లకు ఉన్న అధికారాలను కొత్త చట్టాల్లో పెంచారు. నేరస్థుడిగా ప్రకటించే విషయంలో వారికి ఉన్న పరిధిని విస్తృతం చేశారు. పాత చట్టంలో అత్యాచారానికి 375, 376 సెక్షన్లు ఉండేవి. కొత్త బిల్లులో దానిని సెక్షన్ 63గా పేర్కొన్నారు. పాత చట్టంలో హత్యకు 302 సెక్షన్ ఉండగా, కొత్త బిల్లులో దానిని 101 సెక్షన్‌గా పెట్టారు. కిడ్నాప్‌నకు పాత చట్టంలో 359వ సెక్షన్ ఉండేది. కొత్త బిల్లులో దానిని సెక్షన్ 136 కింద చేర్చారు.
భారతీయ న్యాయ సంహిత(BNS)లోని ముఖ్యాంశాలు :
Bharatiya Nyaya Sanhita : భారతీయ న్యాయ సంహితలో కొత్తగా 20 నేరాలను చేర్చారు. ఐపీసీలోని 19 నిబంధనల తొలగించారు. 33 నేరాల్లో జైలు శిక్ష, 83 నేరాల్లో జరిమానాను పెంచారు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యలు, హిట్ అండ్ రన్, మూక దాడి, పిల్లలను నేరాలకు వినియోగించడం, మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపడం, గొలుసు దొంగతనం, విదేశాల్లో నేరాలను ప్రోత్సహించడం, భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, ఐక్యతను దెబ్బతీయడం, ఫేక్ వార్తలను ప్రచురించడం వంటి నేరాలకు స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు.
- 23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్ష విధింపు.
- కొత్తగా 6 నేరాల్లో సమాజ సేవా శిక్ష.
- పిల్లలకు నిర్వచనం.
- జెండర్‌లో ట్రాన్స్‌జెండర్ల చేర్పు.
- దస్త్రాలుగా ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డుల పరిగణన.
- చరాస్తికి విస్తృత నిర్వచనం.
- మహిళలు, పిల్లలపై నేరాలకు కొత్త అధ్యాయం.
- నేర ప్రయత్నం, ప్రేరణ, కుట్రకు ప్రత్యేక అధ్యాయం.
- ఆత్మహత్యకు ప్రయత్నించడం నేర జాబితా నుంచి తొలగింపు.
- భిక్షాటన మానవ అక్రమ రవాణా నేరంగా పరిగణన.
- రూ.5వేల లోపు దొంగతనాలకు సమాజ సేవ శిక్ష విధింపు.
- పిచ్చివాడు, అవివేకి, ఇడియట్ వంటి పురాతన పదాలు తొమ్మిది చోట్ల తొలగింపు.
- బ్రిటీష్ క్యాలెండర్, క్వీన్, బ్రిటీష్ ఇండియా, శాంతి కోసం న్యాయం వంటి పదాల తొలగింపు.
- 44 చోట్ల కోర్ట్ ఆఫ్ జస్టిస్ స్థానంలో కోర్టు అని వాడుక.
- పిల్లలు అనే పదానికి బిల్లు మొత్తంలో ఏకీకృత నిర్వచనం.
- 12 చోట్ల డీనోట్స్ స్థానంలో మీన్స్ వాడుక. దటీజ్ టూ సే స్థానంలో నేమ్‌లీ వాడుక.