NEET UG 2024 Result Controversy : వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో 67 మందికి ప్రథమ ర్యాంకు రావడంపై నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తడం వల్ల యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ సారథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయించుకున్నట్లు ఎన్టీఏ డీజీ సుబోధ్‌కుమార్ సింగ్ తెలిపారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని పేర్కొన్నారు. 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుందని, నివేదిక తర్వాతే వారి ఫలితాలను సవరించే అవకాశం ఉంటుందన్నారు.
పరీక్ష పేపర్ లీక్ కాలేదు
గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల పరీక్ష అర్హతా ప్రమాణాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్న సుబోధ్ కుమార్ సింగ్ ఉన్నారు. ఆ అభ్యర్థుల ఫలితాల్ని సమీక్షించడం ద్వారా అడ్మిషన్ ప్రక్రియపైనా ఎలాంటి ప్రభావమూ ఉండదని పేర్కొన్నారు. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల్ని సుబోధ్ కుమార్ ఖండించారు. పేపర్ లీక్ కాలేదని, అవకతవకలేమీ జరగలేదన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్ష సమగ్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని స్పష్టంచేశారు. అయితే ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడం వల్ల ఇచ్చిన గ్రేస్ మార్కుల ద్వారా ఆ విద్యార్థులు అధిక మార్కులు సాధించడానికి కారణాలని వివరించారు. అయితే, ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా? లేదా అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఈ అంశంపై నిర్ణయం కమిటీ ఇచ్చిన సిఫారసులపై ఆధారపడి ఉంటుందన్నారు.
అసలేం జరిగిందంటే
జూన్ 4న నీట్ యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో హరియాణాలోని ఓకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురితో సహా 67 మందికి మొదటి ర్యాంకు వచ్చింది. సిలబస్ మార్పులపై అభ్యర్థనలు రావడం వల్ల 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపారు. దీంతో పరీక్షలో అవకతవకలు జరిగాయని విద్యార్థులు దేశవ్యాప్తంగా నిరసలు వ్యక్తం చేశారు.