NEET UG 2024 Paper Leak :దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష 2024 ప్రశ్నపత్రం లీకేజీ నిజమేనని తేలింది. ముందు రోజు రాత్రే నీట్ ప్రశ్నపత్రం తమకు అందిందని బిహార్‌లో అరెస్టైన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించారు. లీకేజీ కీలక సూత్రధారి అయిన నిందితుడు ఒక్కో విద్యార్థి నుంచి 30 నుంచి 32 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని నిందితుడూ అంగీకరించాడు. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బిహార్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. వారిలో అనురాగ్ యాదవ్, నీతీశ్ కుమార్, అమిత్ ఆనంద్‌లతోపాటు దాణాపుర్ మున్సిపాలిటీలో పని చేస్తున్న సికందర్ యాదవేందు అనే జూనియర్ ఇంజినీరు ఉన్నాడు. పట్నాలోని శాస్త్రినగర్ పోలీస్ స్టేషన్‌లో నిందితులను విచారిస్తున్నారు.
లీకేజీకి సూత్రధారి అమిత్ ఆనంద్ అని తేలింది. అతడు యాదవేందుతో కలిసి పేపరును బయటకు తీసుకొచ్చారు. యాదవేందు అనురాగ్ యాదవ్ అనే విద్యార్థికి మామయ్య అవుతాడని తెలిసింది. పరీక్షకు ముందు అమిత్ ఆనంద్, నీతీశ్ కుమార్ పేపరు లీకేజీ గురించి తనకు చెప్పారని యాదవేందు పోలీసుల విచారణలో వెల్లడించాడు. పేపరు 30 నుంచి 32 లక్షలకు దొరుకుతుందని చెప్పడం వల్ల ఆయుష్ కుమార్, అనురాగ్ యాదవ్, శివానంద్ కుమార్, అభిషేక్ కుమార్ అనే విద్యార్థులను తీసుకుని వెళ్లనట్లు వివరించాడు. అనంతరం ఆ విద్యార్థులను విచారించగా పేపర్ తమకు అందిందని ఒప్పుకున్నారు.
"రాజస్థాన్‌లోని కోటాలో నీట్‌కు సన్నద్ధమవుతున్న నాకు మామయ్య ఫోన్ చేశాడు. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశానని, బిహార్ సమస్తీపుర్‌లోని ఇంటికి రమ్మని పిలిచాడు. నీట్ పరీక్ష (మే 5) తేదీకి ఒక రోజు ముందు మే 4న రాత్రి నా స్నేహితులను తీసుకుని నేను మామయ్య వద్దకు వెళ్లాను. అతడు అమిత్ ఆనంద్, నీతీశ్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే నాకు నీట్ ప్రశ్నపత్రం, ఆన్సర్ షీట్ ఇచ్చారు. రాత్రంతా వాటిని మేం బట్టీ పట్టాం. మరుసటి రోజు పరీక్ష కేంద్రానికి వెళ్లిన తర్వాత ప్రశ్నపత్రాన్ని చూస్తే, ముందు రోజు మామయ్య ఇచ్చిన పేపర్‌తో పూర్తిగా సరిపోలింది."
--అనురాగ్, విద్యార్థి