NEET PG Exam Postponed :దేశవ్యాప్తంగా జూన్ 23న జరగాల్సిన నీట్-పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ పరీక్ష వాయిదా వేసినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పింది. "విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తున్నాం. విద్యార్థుల ప్రయోజనాలతోపాటు పరీక్షా ప్రక్రియలో పారదర్శకతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం" అని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
ఎన్‌టీఏ డీజీపై వేటు
మరోవైపు, యూజీసీ నెట్, నీట్- యూజీ పరీక్షల నిర్వహణ విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల నడుమ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ ఆ పదవి నుంచి తొలగించింది. భారత వాణిజ్య ప్రచార సంస్థ (ఐటీపీఓ) ఛైర్మన్, ఎండీ ప్రదీప్ సింగ్ ఖరోలాకు ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. సుబోధ్‌ను కేంద్ర సిబ్బంది, వ్యవహారాలశాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
సుప్రీంలో పిటిషన్
అయితే మే 5న జరిగిన నీట్- యూజీలో జరిగిన అవకతవకలపై సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేసేలా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పరీక్షకు హాజరైన 10 మంది విద్యార్థులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. కేసులో దర్యాప్తును వేగవంతం చేసి వీలైనంత త్వరగా సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించేలా బిహార్ పోలీసుల్ని ఆదేశించాలని కోరారు. పరీక్షలో అనేక ఇతర అవకతవకలు జరిగాయన్న పిటిషనర్లు, ముఖ్యంగా ప్రశ్నపత్రాలను అభ్యర్థులకు సకాలంలో అందుబాటులో ఉంచడంలో అధికారుల తీవ్ర నిర్లక్ష్యం వహించారన్నారు. కొన్ని చోట్ల తప్పుడు ప్రశ్నా పత్రాలను పంపిణీ చేసి, తర్వాత రీకాల్ చేసినట్లు ఆరోపించారు.
నీట్- యూజీ ప్రవేశపరీక్ష 2024 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు మధ్యవర్తులు, విద్యార్థులు సహా 14 మందిని బిహార్ పోలీసులు అరెస్టు చేశారు. వీరందరినీ విచారించగా ఓ వ్యక్తి పేరు ప్రధానంగా వినిపించింది. అతడే సంజీవ్ ముఖియా. ఈ లీకేజ్ రాకెట్ వెనుక ప్రధాన కుట్రదారు అతడేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.