National Conference INDIA alliance :విపక్ష కూటమి ఇండియాలో ఎవరిదారి వారిదేలా కనిపిస్తోంది. కూటమితో సంబంధం లేకుండా జమ్ము కశ్మీర్ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారూక్ అబ్దుల్లా తాజాగా ప్రకటించారు. ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదన్నారు. జమ్ము కశ్మీర్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఎన్డీఏలో చేరే అవకాశాన్ని కూడా ఫారూక్ అబ్దుల్లా తోసిపుచ్చలేదు.
వాజ్‌పేయీ హయాంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. గత నెల జమ్ము ప్రాంతానికి చెందిన పలువురు నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు భాజపాలో చేరారు. మూడుసార్లు జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫారూక్ అబ్దుల్లా ఇండియా కూటమిలోని బలమైన ఓటు బ్యాంకు ఉన్న నాయకుల్లో ఒకరు. కూటమి భేటీల్లో కూడా ఆయన పాల్గొన్నారు. అయితే కూటమిలో సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం లోపించడంపై అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని రక్షంచాలంటే విభేదాలు మరిచిపోయి పనిచేయాలన్నారు.
'కూటమిలో భాగమే'
అయితే, కాంగ్రెస్ మాత్రం ఎన్‌సీ ఇండియా కూటమిలో భాగమేనని చెప్పుకొచ్చింది. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ సైతం తమతోనే ఉందని పేర్కొంది. ఇకపైనా ఎన్‌సీ, పీడీపీ తమతోనే కొనసాగుతాయని స్పష్టం చేసింది. సీట్ల పంపకంపై చర్చలు నడుస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ పేర్కొన్నారు. ప్రతి పార్టీకి తమ తమ పరిమితులు ఉన్నాయని అన్నారు.
'చర్చలేం జరగలేదు'
మరోవైపు, కాంగ్రెస్తో అధికారికంగా ఎలాంటి చర్చలు జరగలేదని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. తాము ఇండియా కూటమిలో భాగమేనని అన్నారు. బీజేపీ నుంచి సీట్లు గెలవడమే తమ అతిపెద్ద లక్ష్యమని చెప్పారు. ఈ లక్ష్యం నెరవేర్చుకునేందుకు కొన్ని త్యాగాలు చేయక తప్పదని అన్నారు. అవసరమైతే కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటుకు తాము సిద్ధమేనని చెప్పారు.