Myanmar Soldiers Flee to India :మయన్మార్‌లో తిరుగుబాటుదారులు, జుంటా ప్రభుత్వం మధ్య పోరు ఉద్ధృతమైంది. రెబల్స్ దాడుల నుంచి తప్పించుకునేందుకు మయన్మార్ సైనికులు దేశంలోకి ప్రవేశిస్తున్నారని మిజోరం ప్రభుత్వం కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. సాధ్యమైనంత త్వరగా పొరుగుదేశానికి చెందిన సైనికులను తిరిగి వెనక్కి పంపాలని కోరింది. దాదాపు 600 మంది మయన్మార్ సైనికులు భారత్‌లోకి చొరబడినట్లు తెలుస్తోంది.
మయన్మార్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేపట్టిన సైన్యానికి గత కొంతకాలంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రజాస్వామ్య అనుకూలవాదులతో ఏర్పడిన సాయుధ బృందాలు సైనిక సర్కారుపై పోరాటానికి దిగుతున్నాయి. ఈ బృందాలకు, మయన్మార్ సైన్యానికి మధ్య గట్టి పోరు నడుస్తోంది. కొన్నిచోట్ల ప్రజాస్వామ్య అనుకూల గ్రూప్‌లు పైచేయి సాధిస్తున్నాయి. ఈ ఘర్షణల కారణంగానే ఇప్పటివరకు 600 మంది మయన్మార్ సైనికులు సరిహద్దు దాటి భారత్‌లోకి వచ్చారు.
మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రానికి చెందిన సైనిక క్యాంపును రెబల్స్‌కు చెందిన అరాకన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆ దేశ సైనికులు మిజోరంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వారంతా లాంగ్‌ట్లాయ్ జిల్లాలోని అసోం రైఫిల్స్‌కు చెందిన క్యాంపులో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితులపై మిజోరం సీఎం లాల్‌దుహోమా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చర్చించారు. మయన్మార్‌లో నెలకొన్న కల్లోల పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన అనేకమంది ఆశ్రయం పొందేందుకు వస్తున్నారని, మానవతా దృక్పథంతో వారికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు మిజోరం సీఎం తెలిపారు. ఇప్పటికే 400 మంది సైనికులను వెనక్కి పంపినట్లు వెల్లడించారు.